Tuesday, September 16, 2025

16 వేల మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించనున్న కేంద్రం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశం నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నార్కోటిక్స్ రవాణా ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశం లోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్నవారందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి హోం మంత్రిత్వశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పలు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే కొత్త చట్టం సెప్టెంబర్ 2న అమల్లోకి వచ్చింది. వలసలు, విదేవీయుల చట్టం 2025 గా వ్యవహరిస్తున్న దీనిని బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించగా, ఏప్రిల్ 4న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. నాలుగు పాత చట్టాల స్థానంలో ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దేశం లోకి ప్రవేశించిన విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా, భారత్‌లో పేదరికంలో మగ్గుతున్నవారు కోట్లాది మంది ఉన్నారు. పేదరికాన్ని అంతం చేయడానికి ప్రభుత్వాలు రూ.కోట్ల నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అయితే ఈ సమస్య పరిష్కారంలో అక్రమ వలసలు ప్రధాన అడ్డుగోడగా నిలుస్తున్నాయి. సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులు చట్ట విరుద్ధంగా ఉండటమే కాకుండా అసలైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ ఫలాలను వీరు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ద్వారా వారిని దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది.

Also Read: పరారీలో పూజా ఖేడ్కర్ తండ్రి, బాడీగార్డ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News