Monday, August 18, 2025

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి కేటాయించిన విధంగా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. యూరియా కేటాయింపులు, సరఫరా అంశంపై కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆగస్టు నెలాఖరులో నాలుగు నౌకల ద్వారా వచ్చే యూరియాలో ప్రతి నౌక నుంచి అదనంగా 20 వేలు టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రానికి మంత్రి తు మ్మల విజ్ఞప్తి చేశారు. ఆదివారం సచివాలయంలో రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి రాష్ట్రం లో యూరియా పరిస్థితిని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి సీజన్‌కు ముందే ఎరువులను కేటాయింపులు చేస్తుందని, అందులోభాగంగా తెలంగాణకు  కూడా యూరియాతో కలిపి ఐదు రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని తెలిపారు. అందులో యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, డిఎపి, కాంప్లెక్స్, ఎంవోపి,

ఎస్‌ఎస్‌పి కలిపి మొత్తం 13.95 మెట్రిక్ టన్నుల మేరకు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుత సీజన్ ప్రారంభానికి ముందు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.మంత్రి తుమ్మల మాట్లాడుతూ కేంద్రం కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసిందని, దీంతో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పండిందని తెలిపారు. ఎప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేటాయించిన 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో స్వదేశీ యూరియా 4.34 లక్షల మెట్రిక్ టన్నులు, దిగుమతి యూరియా 3.96 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో స్వదేశీ యూరియాలో 3.27 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, దిగుమతి యూరియాలో 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా సరఫరా అయ్యినట్లు మంత్రి తుమ్మల గణాంకాలను అధికారులకు వివరించారు.

పార్లమెంటులో నిలదీయండి
రాష్ట్రంలో యూరియా కొరత విషయాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఎంపీలను కోరారు. రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన రాష్ట్ర ఎంపీలను కోరారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ లో రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తించి పార్లమెంటులో ఆందోళన చేయాలని సూచించారు. కేటాయింపుల ప్రకారం పూర్తిస్థాయిలో యూరియా రాష్ట్రానికి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రామగుండం ఫెర్టిలైజెర్స్ లోటు
స్వదేశీ యూరియాలో ప్రధానంగా రాష్ట్రానికి రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ(ఆర్‌ఎఫ్‌సిఎల్) నుంచి సరఫరా కావాల్సి ఉండగా, ఎప్రిల్ నుంచి ఆగస్టు వరకు 145 పనిదినాలకు గాను, 78 రోజుల పాటు రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉత్పత్తి జరగకపోవడం వల్ల రాష్ట్రానికి సరఫరా కావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడిందన్నారు. అంతేకాకుండా దిగుమతి ద్వారా సరఫరా కావాల్సిన యూరియాలో కొన్ని నెలలలో కొన్ని కంపెనీలు రాష్ట్రానికి సరఫరాలే చేయలేదని మంత్రి తెలిపారు.

రాజకీయం చేస్తున్నారు
రాష్ట్రానికి రావాల్సిన యూరియా గణాంకాలు గుర్తించకుండా రాష్ట్ర బిజెపి నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. అవే లెక్కలతో రాష్ట్రం నుంచి తాను, వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర మంత్రి జెపి నడ్డా, కేంద్ర వ్యవసాయశాఖ అధికారులకు ఎన్నిసార్లు లేఖల ద్వారా సమస్యను వివరించినా పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. యూరియా కొరత సమస్య బిజెపి పాలిత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఉందన్నారు.

యూరియా అమ్మకాలు అధికం
ఈసారి సీజన్ ముందుస్తుగా ప్రారంభంకావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు చేయడం వల్ల గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం యూరియా అమ్మకాలు అధికంగా జరిగినట్లు గుర్తించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ముఖ్యంగా నల్లగొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిల్లాలలో గత సంవత్సరంతో పోలిస్తే అధికంగా అమ్మకాలు జరిగాయన్నారు.
పక్కదారి పట్టకుండా టాస్క్ ఫోర్స్ నిఘా
రాష్ట్రంలో యూరియాను వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు మళ్లించకుండా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఎవరైనా యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో వ్యవసాయశాఖ కార్యదర్శి సోమవారం సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి గారు, హాకా ఎండి చంద్రశేఖర్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి , ఆగ్రోస్ ఎండి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News