Wednesday, September 10, 2025

బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబు భాగస్వామి: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మా పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడిగారు. మా హయాంలో రైతులకు ఇబ్బంది రాలేదని,  మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారని, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులకోసం వైసిపి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిందని,  రైతుల కోసం పోరాడితే తప్పేంటి అని, రైతులు ఇబ్బందిపడుతుంటే వాళ్ల తరుఫున మాట్లాడకూడదా? అని, రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, సకాలంలో ఎరువులు అందిస్తే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు కదా అని విమర్శించారు. రెండు నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సొంత జిల్లా చిత్తూరులోని రైతులు అగచాట్లు పడుతున్నారని,  ఎంత మొత్తంలో ఎరువులు కావాలో చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదా?, సీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతోందో తెలియదా? అని చురకలంటించారు.

Also Read: జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

వైసిపి పాలనలో రైతులకు ఇబ్బంది కలగకూడదని జగన్ అనే వ్యక్తి ఆలోచించాడని, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. ఈ ఖరీఫ్ లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారని, గత సీజన్‌తో పోలిస్తే 97 వేల మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా ఇచ్చామని బాబు గొప్పలు చెబుతున్నారని, రైతులు యూరియా కోసం ఎందుకు రోడ్లకు ఎక్కుతున్నారని జగన్ ప్రశ్నించారు. యూరియాను ఎక్కువ మొత్తం ప్రైవేటుకు కేటాయించారని, ఎరువులను టిడిపి నేతలు అక్రమంగా తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎరువులను దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు చేశారు.

యూరియాలో రూ.250 కోట్ల స్కామ్ జరిగిందని ధ్వజమెత్తారు. వైసిపి పాలనలో తప్పు చేయాలంటే భయపడేవారని, ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కామ్‌లు చేయిస్తున్నారని, ఆంధ్రాలో దోచుకో, పంచుకో, తినుకో పధతి నడుస్తోందని జగన్ ఘాటు విమర్శలు చేశారు.  మెడికల్‌ కాలేజీలను పిపిపి విధానంలో ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని, రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని, ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని, రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల దోపిడీ చేస్తున్నారని, రాష్ట్రంలో పాలన ప్రజలకోసం సాగుతోందా.? దోపిడీదారుల కోసమా? అని జగన్ అడిగారు. ఆర్‌బికెలు, ఈ క్రాప్‌, పిఎసిలను నిర్వీర్యం చేశారని, గతేడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడంలేదని, ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉల్లి ధర క్వింటాల్‌ రూ.200కు పడిపోయిందని, ఆన్‌లైన్ కామర్స్‌లో క్వింటాల్‌ రూ.3,400 ఉందన్నారు. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని, చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కట్టలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 17 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఒక్కో మెడికల్‌ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశామని, మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఎన్ఎంసి 50 సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కిపంపారని, మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తే, ఎపి ప్రజలకే మేలు జరుగుతుందని, మా ప్రణాళిక అమలు జరిగి ఉంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల కాలేజీలు గతేడాదే అందుబాటులోకి వచ్చేవన్నారు. ఈ ఏడాది మరో 6 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవని తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News