Wednesday, September 10, 2025

సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అనంతపురం: తెలుగుతమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అనంతపురం‌లో నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఎపి బిజెపి చీఫ్ పి.వి.ఎన్.మాధవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది కావడం విశేషం.

ఈ సభలో సిఎం చంద్రబాబు (Chandrababu Naidu) ప్రసంగిస్తూ.. ‘‘సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ అదరగొట్టింది. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు.. ప్రజల జీవనప్రమాణం పెరగాలి. నేపాల్‌లోని తెలుగువాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. 57 శాతం ప్రజలు మా ప్రభుత్వానికి ఓట్లు వేశారు. ఎన్నికల్లో కూటమికి 95 శాతానికి పైగా స్ట్రైక్‌రేటు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అగాధంలోకి నెట్టేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిలిపేసింది. నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది.. పరిపాలన గాడిలో పెడుతున్నాం. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నాం. సూపర్ సిక్స్ పథకాలను వైసిపి నేతలు అవహేళన చేశారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారు. పరిమితులు లేకుండా తల్లికి వందనం అమలు చేశాం. ఎంత మంది పిల్లలుంటే.. అంతమందికీ రూ.15 వేలు ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరిగేలా మహిళలకు స్వేచ్ఛ ఇచ్చాం. ఇప్పటివరకూ 5 కోట్ల మంది మహిళలు ఫ్రీబస్ ఉపయోగించుకున్నారు. ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది’’ అని తెలిపారు.

ఎన్డిఎ కూటమికి రైతే రాజు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘రైతులకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. 47 లక్షల మంది రైతులకు తొలి విడత ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమచేశాం. రైతులకు యూరియా కొరత రాకుండా చేసే బాధ్యత నాది. నేను అడగ్గానే.. కేంద్రం 7 రేక్‌ల యూరియా ఇచ్చింది. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే దీపం-2 పథకంపై రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశాం. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పించాం. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము ఏడాదిలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం’’ అని అన్నారు.

యువత భవిష్యత్తును బంగారుమయంగా చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చంద్రబాబు స్పష్టం చేశారు.‘‘ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం. గతంలో ఇంటికో ఐటీ ఉద్యోగి ఉండాలని సంకల్పించా.. నెరవేర్చాను. దసరా రోజున ఆటోడ్రైవర్లకు వాహనమిత్ర ప్రారంభం. వాహనమిత్ర ద్వారా ఆటోడ్రైవర్లకు రూ.15 వేలు ఇస్తాం. ఎన్నికల్లో చెప్పాం.. ఎన్ని కష్టాలున్నా అమలు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Also Read : ఎపిలో ఎక్కడా యూరియా సమస్య లేదు: అచ్చెన్నాయుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News