అమరావతి: బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నామని, ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నా కాబట్టే అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. పంద్రాగస్టువేడుకల్లో బనకచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. గోదావరి, కృష్ణా వృథా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని, బనకచర్ల ద్వారా గోదావరి వృథా జలాలను పొలవరం నుంచి బనకచర్లకు మళ్లిస్తామని, అక్కడి నుంచి రాయలసీమకు మళ్లించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రకాశం జిల్లాను కరువు నుంచి బయటపడేసే వెలుగొండకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వచ్చే ఏడాది జులై నాటికి సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు చేస్తున్నామని వివరించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.12157 కోట్ల నిధులు విడుదల చేసిందని, నిధులు సకాలంలో విడుదల చేయడంతో కేంద్రం సహకరిస్తోందన్నారు. 2028 నాటికి జల జీవన్ మిషన్ కింద ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు.
వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా?: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -