కడప: పులివెందుల విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. అందుకే పులివెందులలో 11 మంది నామినేషన్లు వేశారని, పులివెందుల కౌంటింగ్‌లో ఓటర్ల స్లిప్పులు దొరికాయని, 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని స్లిప్పులు పెట్టారని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారన్నారు. ఇవాళ పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని, స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పులివెందుల ప్రజలు గెలిపించారని చంద్రబాబు కొనియాడారు. గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రత్యర్థులను నామినేషన్ వేయనిచ్చే వారు కాదని చంద్రబాబు మండిపడ్డారు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైనా ప్రజలను ఓటు వేయనిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ పుణ్యమా అని పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పులివెందులకు నీరు అందించడంతో పాటు అభివృద్ధి ఫలాలను ఆ ప్రాంత ప్రజలకు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
పులివెందుల జెడ్ పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసిపి అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి 6052 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లురాగా వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి.