Saturday, May 3, 2025

చెత్త ఆటతో తేలిపోయిన చెన్నై

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో కళ్లు చెదిరే రికార్డు కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) సీజన్ 2025లో మాత్రం చెత్త ఆటతో అభిమానులను పూర్తిగా నిరాశ పరిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సిఎస్‌కె పేలవమైన ఆటతో తేలిపోయింది. వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ ఓడించి చెన్నై టైటిల్ వేటకు శ్రీకారం చుట్టింది. కానీ తర్వాతి మ్యాచుల నుంచి చెన్నై ఆట పూర్తిగా మారిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చెత్త ప్రదర్శనతో వరుస ఓటములను చవిచూసింది.

ఇతర జట్లతో పోల్చితే సిఎస్‌కె బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. అయినా చెన్నైకి చేదు అనుభవం తప్పలేదు. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, సామ్ కరన్, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంత మంది స్టార్లు జట్టుకు అందుబాటులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఆటగాళ్లు తమవంతు పాత్రను సమర్థంగా పోషించక పోవడం చెన్నై దుస్థితికి కారణమని చెప్పాలి. రచిన్ రవీంద్ర ఆరంభంలో బాగానే ఆడినా తర్వాత తేలిపోయాడు. కెప్టెన్ రుతురాజ్ గాయం వల్ల టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

ధోనీ కూడా తన మార్క్ ఆటను కనబరచలేక పోయాడు. అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా జట్టుకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు. జడేజా, అశ్విన్, దూబె తదితరులు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయారు. ఇక త్రిపాఠి, హుడాలు పూర్తిగా నిరాశ పరిచారు. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. హుడా, దీపక్‌లు చెత్త ఆటతో జట్టుకు భారంగా మారారు. ప్రపంచ శ్రేణి ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా పూర్తిగా తేలిపోయాడు. బంతితో, బ్యాట్‌తో జట్టును ఆదుకోలేక పోయాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ తేలిపోవడంతో చెన్నై నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News