ఝాన్సీరెడ్డి, తిరుపతిరెడ్డి వర్గాల మధ్య చీలిక
తిరుపతిరెడ్డిని ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం
టెంట్లు కూల్చి.. కుర్చీలు విసిరి నిరసన
సమావేశం నిర్వహించడకుండా వెనుదిరిగిన గ్రామ ఇన్‌ఛార్జి
మన తెలంగాణ/తొర్రూరు ప్రతినిధి: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు రచ్చకెక్కడంతో రోజుకో తీరు ఆరోపణలు, నిరసనలతో పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొంటోంది. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, ఆమెకు కుమారుడి వరస ఆయిన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి మధ్య మనస్పర్ధలు వెలుగు చూడడంతో కాంగ్రెస్‌లో విబేధాలు బట్టబయలు అయ్యాయి. చివరికి సోషల్ మీడియాలో, టీవీల్లో చర్చావేదికలు పెట్టి ఇంటర్వూలు ఇస్తూ ఒకరిపై ఒక్కరు విమర్శలు చేస్తుండడంతో కింది స్థాయి నాయకత్వం, పార్టీ కార్యకర్తల్లో కూడా ఝాన్సీరెడ్డి, తిరుపతిరెడ్డి వర్గాలుగా ముద్ర వేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పని తీరును సమర్ధిస్తూనే తిరుపతిరెడ్డితో పాటు తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ బహిరంగంగా ఝాన్సీరెడ్డి వైఖరి మార్చుకోవాలంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పరిణామాలు రోజుకో తీరు కొనసాగుతున్న తరుణంలో తాజాగా ఆదివారం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల ఇన్‌ఛార్జిగా పాలకుర్తికి చెందిన ఎర్రబెల్లి రాఘవరావు హాజరయ్యారు. ఝాన్సీరెడ్డి, తిరుపతిరెడ్డి వర్గాలుగా చీలడంతో సమావేశానికి తిరుపతిరెడ్డిని పిలువకుండా ఎలా వచ్చారంటూ పలువురు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టెంట్లు కూల్చి కుర్చీలను చెల్లాచెదురు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఝాన్సీరెడ్డి, యశస్వినిరెడ్డి కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి వీరు ఓడిపోవాలని చూసిన వారిని ఎలా అక్కన చేర్చుకుంటారని అంటూ ప్రశ్నించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకుని చివరికి సమావేశాన్ని నిర్వహించకుండానే రాఘవరావు వెనుదిరిగారు.
ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో విబేధాల వ్యవహారం ప్రజల్లో చర్చకు దారి తీయగా ఆదివారం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆమెరికా నుండి వచ్చారు. ఝాన్సీరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నేతలు యశస్వినిరెడ్డి రాకతో ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎవరి వైపు నిలుస్తారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకుంది. చెర్లపాలెంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, వాసురెడ్డి, మహేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మహబూబ్‌రెడ్డి, రామచంద్రు, ఎద్దు మహేష్, యాకయ్య, సాయిలు, ప్రవీణ్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.