Tuesday, September 9, 2025

వీడని మత్తుతో యువత చిత్తు

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు మాదకద్రవ్యాలు ఖండాలు దాటి వచ్చేవి. కొలంబియా, మెక్సికో, నైజీరియా వంటి దేశాలు మత్తు మందులకు కేంద్రాలుగా ఉంటూ, పోలీసుల కళ్లు గప్పి ఇతర దేశాలకు అతి కష్టంపై రవాణా చేసేవి. కొన్నాళ్ల క్రితం వరకూ వీటి వాడకం అమెరికావంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కారణంగా ఇప్పుడు మత్తుమందులు దేశదేశాలకూ రవాణా అవుతున్నాయి. అవి పల్లెటూళ్లకు సైతం అందుబాటులోకి వచ్చాయన్నా, వాటి తయారీ ఒక కుటీర పరిశ్రమగా మారిపోయిందన్నా అతిశయోక్తి ఏమాత్రం లేదు. గంజాయి మాట అలా ఉంచితే ప్రమాదకరమైన హెరాయిన్, కొకైన్ తదితర మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లసమూహాల మధ్యే దర్జాగా తయారు చేస్తున్నారు. జనసాంద్రత అధికంగా గల ఆసియా దేశాలకు మత్తుమందులను విస్తరించి, పేదలను సైతం వాటికి బానిసలను చేసి, సొమ్ము చేసుకునేందుకు డ్రగ్ స్మగ్లర్లు తెగబడుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో మత్తుమందులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ స్థావరంలో అత్యవసర మందుల తయారీ పేరిట ప్రమాదకరమైన మెఫెడ్రోన్ అనే మత్తుమందును టన్నుల కొలదీ తయారు చేస్తున్నారన్న విషయం తెలుసుకుని, సభ్యసమాజం ముక్కున వేలేసుకుంది. మత్తు మందులపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ, ఎక్కడికక్కడ స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నప్పటికీ జంకూగొంకూ లేకుండా ఇలా మత్తుమందుల తయారీకి ఏకంగా ఓ ఫ్యాక్టరీనే పెట్టడం స్మగ్లర్ల బరితెగింపునకు నిదర్శనం. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర పోలీసులు మాదకద్రవ్యాల సరఫరా, వాడకాన్ని తుదముట్టించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ నార్కొటిక్ నియంత్రణ కేంద్రాల ఏర్పాటుతోపాటు నగరంలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్లను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అంతేకాదు, యాంటీ నార్కొటిక్ బ్యూరోకు తోడుగా ప్రభుత్వం ఇటీవల ఈగల్ విభాగాన్ని సైతం ప్రారంభించి హ్యూమన్, టెక్నికల్ ఇంటలిజెన్స్ సాయంతో సరఫరాదారులు, వినియోగదారుల భరతం పడుతోంది. అయినప్పటికీ రోజూ పదుల సంఖ్యలో మాదకద్రవ్యాల కేసులు బయటపడుతూండటాన్ని బట్టి, ఈ మత్తుమందులకు జనం ఎంతగా అలవాటు పడుతున్నారో అర్ధమవుతుంది. నిరక్షరాస్యులే ఇలాంటి మత్తుమందులకు అలవాటు పడతారన్న అపోహను తుడిచిపెడుతూ వైద్యవిద్యార్థులు సైతం గంజాయితోపాటు ఖరీదైన మత్తుమందులను వినియోగిస్తున్నట్లు తాజాగా వెలుగుచూసిన అనేక దృష్టాంతాలు రుజువు చేస్తున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో గంజాయికి అలవాటు పడిన కొందరు జూనియర్ డాక్టర్లను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాదకద్రవ్యాల దురలవాటుకు యువత బాగా అలవాటుపడుతోంది. మత్తుమందుల విక్రేతలు చిన్నారులను సైతం వదలడం లేదు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో మత్తుమందులతో తయారు చేసిన చాక్లెట్లను విక్రయిస్తూ వారిని ఈ దురలవాటుకు బానిసలను చేస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, విద్యార్థులలోనే కొందరిని వాలంటీర్లుగా నియమించి, పిల్లలను ఈ వ్యసనంనుంచి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.

దేశంలో డ్రగ్స్ వినియోగంపై ఆరేళ్ల క్రితం సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో జనాభాలో 14 శాతం మంది మద్యపానానికి, 2.8 శాతం మంది గంజాయికి అలవాటు పడినట్లు తేలింది. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో గంజాయి వినియోగదారులు ఎక్కువమంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఫ్రభుత్వం మత్తుమందుల విక్రేతల నడుం విరిచేందుకు ‘నషా ముక్త్ భారత్’ పేరిట అప్పట్లోనే ఒక కార్యాచరణ ప్రణాళికను రచించింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ లభ్యత అధికంగా ఉన్న 272 జిల్లాలను గుర్తించి, వాటికి మత్తుమందులనుంచి విముక్తి కల్పించాలని సంకల్పించింది. అయితే ఆచరణలో ఈ పథకం డీలా పడిన కారణంగానే చర్లపల్లి సంఘటనల్లాంటివి వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర తదితర కొన్ని రాష్ట్రాలు మాదక ద్రవ్యాల భరతం పట్టేందుకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. వీటికి ఇతర రాష్ట్రాలతోపాటు కేంద్రప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరం. ఒక రాష్ట్రంలో ఆంక్షలు ఎక్కువైతే, మరో రాష్ట్రానికి వలస పోయి, అక్కడ తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్న డ్రగ్స్ విక్రేతల ఆటకట్టించాలంటే అన్ని రాష్ట్రాలూ కలసికట్టుగా యుద్ధం ప్రకటించడమొక్కటే మార్గం. ఇందుకు నాయకత్వం వహించివలసింది కేంద్రమే. కేంద్రప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రాలన్నీ కలసికట్టుగా దండెత్తకపోతే ఈ మత్తుమందుల మహమ్మారిని అంతమొందించడం కష్టసాధ్యమే.

Also Read: ‘కారు’లో తకరారు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News