మనతెలంగాణ,సిటిబ్యూరోః చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫార్మ కంపెనీలో పనిచేసిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ అక్కడ డ్రగ్స్ తయారీ గురించి తెలుసుకున్నాడు. నాచారం, చర్లపల్లిలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మెఫడ్రిన్ డ్రగ్స్ తయారు చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నాడు. శ్రీనివాస్ గతంలో పోలీసులకు పట్టుబడినా తన పలుకుబడిని ఉపయోగించుకుని డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకున్నట్లు తెలిసింది. వాగ్దేవీ ల్యాబొరేటరీస్‌లో తయారు చేసి డ్రగ్స్‌ను ముంబాయికి సరఫరా చేస్తున్నాడు.
ముంబాయి క్రైం బ్రాంచ్ పోలీసులు ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన యువతిని అరెస్టు చేయగా, మరో పది మంది ముఠా గురించి తెలిసింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చర్లపల్లి డ్రగ్స్ ఫ్యాక్టరీ గురించి బయటపడింది. అప్పటి నుంచి వాగ్దేవి ల్యాబొరేటరీస్‌పై నిఘా పెట్టిన ముంబాయి పోలీసులు.. ఓ కానిస్టేబుల్‌ను ల్యాబొరేటరీలో కార్మికుడిగా చేర్పించారు. నెల రోజుల పాటు డ్రగ్స్ తయారీ దందా వివరాలను తెలుసుకున్న కానిస్టేబుల్ తర్వాత ఉన్నతాధికారులకు పూర్తి వివరాలు పంపించాడు. దీంతో ముంబాయి క్రైం బ్రాంచ్‌కు చెందిన పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 35,500 లీటర్ల ముడి సరుకు, 5.79కిలోల మెఫిడ్రోన్, 950 కిలోల పొడి పదార్థాన్ని, మిథైలెనెడియాక్సీ, మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: అడగకుండా టాయిలెట్‌కు వెళ్లిందని.. చిన్నారికి ఘోరమైన పనిష్‌మెంట్