కర్ణాటకలోని దావణగేరేలో ఓ కోడి నీలం రంగు గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చన్నగిరి తాలూకాలోని నల్లూర్ గ్రామానికి చెందిన సయ్యద్ నూర్‌కు చెందిన 10 కోడి పెట్టెల్లో ఒకటి నీలం రంగు గుడ్డు పెట్టింది. ఈ వార్త స్థానికంగా సంచలనం అయ్యింది. ఈ సంచలన వార్త జంతు సంరక్షణ అధికారులకు చేరింది. వారు వచ్చి కోడిని, గుడ్డును పరిశీలించారు. నీలం రంగు గుడ్డు అరుదని వారన్నారు. చన్నగిరి తాలూక అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గుడ్డును పరిశీలించింది. ‘బిలివెర్డిన్’ అనే పిగ్‌మెంట్ కారణంగానే ఈ నీలం రంగు గుడ్డును కోడి పెట్టిందని ఆయన వివరించారు. పిగ్‌మెంట్ కారణంగా కొన్ని కోడ్లు నీలం లేక ఆకుపచ్చని గుడ్లు పెట్టొచ్చని ఆయన ధ్రువీకరించారు.
అయితే గుడ్డులో పోషక విలువలు ఏ మాత్రం తగ్గవని, సాధారణ గుడ్లలో ఉన్నట్టే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నీలం రంగు గుడ్డు అద్భుతాన్ని చూసేందుకు గ్రామస్థులు ఎగబడుతున్నారని సమాచారం. కొందరేమో ఈ నీలం గుడ్డు అదృష్టాన్ని ఇస్తుందని, మరి కొందరేమో శాస్త్రీయ వివరణ అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా ఒకవేళ ఈ కోడి పెట్ట ఇదే మాదిరి నీలం రంగు గుడ్లను పెడుతుంటే దాని జన్యు, జీవరసాయన కారణాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తామని డాక్టర్ అశోక్ తెలిపారు. కాగా నీలం రంగు గుడ్డు పెట్టిన ఆ కోడి పెట్ట ఆరోగ్యాన్ని, డేటాని గమనిస్తుంటామని జంతు సంరక్షణ శాఖ హామీ ఇచ్చింది.