బెంగళూరు: వంద మంది ఎంఎల్‌ఎ మద్దతు ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌కు ఉందని ఎంఎల్ఎ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యమంత్రిగా శివ కుమార్ బాధ్యతలు తీసుకుంటారని కర్నాటక కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తొలగించిన తరువాత శివకుమార్ ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు హైకమాండ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. మంగళవారం ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు శివ కుమార్‌కు సిఎం పదవి ఇవ్వకపోతే 2028లో కాంగ్రెస్ అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్యా సిఎం మార్పు అవసరమని వివరించారు.
కర్నాటకలో మంచి పాలన రావాలని వంద మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కోరుకుంటున్నారని, ఇప్పుడు డికె శివ కుమార్ సిఎం పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతుందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలని ఎంఎల్ఎ సూచిస్తున్నారని, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసునన్నారు. సిఎం మార్పుపై కర్నాటకలో తీవ్ర చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మీడియా ప్రశ్నించింది. సిఎం మార్పు విషయం అనేది కాంగ్రెస్ అధిష్ఠానం చేతిలో ఉంటుందని, హైకమాండ్‌లో ఏం జరుగుతుందని ఎవరికీ తెలియదన్నారు. హైకమాండ్ నిర్ణయాల గురించి ఎవరు చెప్పలేరని ఖర్గే స్పష్టం చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ పార్టీ అనవసర వివాదాలు సృష్టించవద్దని నాయకులను హెచ్చరించారు.