- Advertisement -
వెలుగును చీకటి మింగేసినాక
రాలిపడుతున్న ఉల్కల గమనం తెలిసింది
ఒక పొద్దు పొడుపు
చీకట్లో దుఃఖాన్ని మింగేసి
నవ్వుల వెలుతురులో
లోకాన్ని నడిపించింది
ఎన్ని రాత్రుల పొద్దులు గడిచిపోతేనో
ఒక బతుకులో మబ్బులు తొలిగిపోయేది
ఎన్ని నక్షత్రాల మిణుగురులు ఏకమైతేనో
ఒక రవి కాంతి పుంజానికి సమానమైయ్యేది
ఎన్ని కాంతి వేగాలకు సరితూగితేనో
ఒక మనసు పయనం కొలమానమయ్యేది
ఒక పొద్దు పొడుపు
ఎన్ని మెళకువలకు కళలు తెప్పిస్తేనో
ఒక కలకు అంతరార్థం అవగతమయ్యేది
ఎన్ని పొద్దుల ప్రయాణం సాగిపోతేనో
ఒక బ్రతుకు జీవన గతి ముగింపుకొచ్చేది
వెలుగు మాత్రమే
విజయానికి సంకేతం కాదు
చీకటి కోణంలోనే కదా
పాఠం జ్ఞాపకాల్ని మిగిల్చేది
ఒక రాత్రి నిశ్శబ్దపు మౌనంతో
ఉండిపోతేనే కదా
ఒక ప్రశాంతతకు
పుట్టక మొదలయ్యేది
ఒక ఉదయానికి
ఉదయం కలిగేది
నరెద్దుల రాజారెడ్డి
- Advertisement -