Tuesday, September 2, 2025

కల్తీ కల్లు కల్లోలంలో బాల్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు ఉయ్యాల తొట్టినుంచి బయటకు వచ్చేసరికి కల్తీకల్లుకు బానిసలై పోతున్నారు. కల్తీకల్లు కారణంగా ఏడుగురు ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంచలనం కలిగించింది. ఈ సంఘటనలో మరో చీకటి కోణం బయటపడింది. ఆల్ఫ్రాజోమ్ (ఎక్సనాక్స్) డయాజిపామ్ (వాలియమ్) క్లోర్‌డయాజిపాక్సైడ్ (లిబ్రియమ్) వంటి మత్తుమందులు కలిపిన కల్లుకు పిల్లలు బానిసలవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పిల్లల్లో కొంతమంది రెండేళ్ల వయసువారు కూడా ఉన్నారు. వారింకా కాళ్లమీద నిలబడడం నేర్చుకోకముందే మూర్ఛ, నిద్రలేమి, జ్వరం వంటి లక్షణాలతో వారిని డాక్టర్ల వద్దకు తల్లిదండ్రులు తీసుకు వస్తున్నారు. తెలంగాణలో పిల్లలు అల్లరి చేయకుండా సమాధానపర్చడానికి, నిద్రపుచ్చడానికి వారిచే కల్లు తాగించడం తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలకు అలవాటుగా వస్తోంది. కానీ కల్లులో విపరీతమైన మత్తు పదార్ధాలు కలిసి ఉంటాయని తల్లిదండ్రులు తెలుసుకోవడం లేదు.

కొవిడ్ మహమ్మారి వ్యాపించిన దగ్గరి నుంచి ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ప్రతినెలా నాలుగైదు కేసులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా సమయంలో ఇంటిదగ్గరే చాలా మంది ఉండిపోవలసివచ్చింది. ఆ సమయంలో చాలా మంది కల్లు తాగడం అలవాటుగా చేసుకున్నారు. కల్లు తాగితే ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావన్న గుడ్డి నమ్మకం చివరకు కల్లుకు బానిసలుగా మార్చింది. ఒకటిన్నర ఏళ్ల వయసు బాలికకు బాగా నిద్రపట్టడానికి ఆమె అమ్మమ్మ ఒక చెంచాడు కల్లును రోజూ తాగించడాన్ని నిలోఫర్ ఆస్పత్రికిచెందిన డాక్టర్లు గమనించడం విశేషం. తెలంగాణలో అల్ఫ్రాజోలమ్ లేదా కొన్ని రసాయనాలు కలిపిన కల్తీ కల్లు 90 శాతం వరకు అమ్ముడవుతోందని పోలీసులు, ఎక్సైజ్ విభాగం వారు చెబుతున్నారు.

ఇక పిల్లలకు చెంచాడైనా కల్లు ఇవ్వరాదని తల్లిదండ్రులను హెచ్చరించాల్సిన అత్యవసరం ఉందని పేర్కొన్నారు. అస్వస్థతకు కల్లు కారణం కాదని కొట్టిపారేయడంతో పిల్లలు కల్లు కు బానిసకావడాన్ని డాక్టర్లు గుర్తించడం కష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం మొత్తం పిల్లలతోసహా కల్లు తాగడం ఒక సాధారణ సంప్రదాయంగా వర్ధిల్లుతోంది. పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు పనులమీద వెళ్లిపోయినప్పుడు పిల్లలను పడుకోబెట్టడానికి కల్లు తాగించడం పరిపాటిగా మారింది. అందువల్ల ఏడెనిమిదేళ్లు రాగానే ఆ పిల్లలు పూర్తిగా కల్తీ కల్లుకు బానిసై పోవడం జరుగుతోంది. ఫలితంగా వారి యువ దేహాలకు తీరని నష్టం జరుగుతోందని డాక్టర్లు పేర్కొన్నారు. పెద్దలకు భిన్నంగా బెంజోడయాజెపైన్స్ వంటి మత్తు పదార్థం కలిసిన కల్లు సేవించడంతో పిల్లల్లో వేగంగా మెదడు దెబ్బతింటోంది. మూర్ఛ వచ్చి ఊపిరి తీసుకోవడం కష్టమైతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఎదురవుతుంది.

అంతేకాదు ఎపిలెప్టికస్ స్థితి ఏర్పడితే అంటే దీర్ఘకాల మూర్ఛ సంభవించే పరిస్థితి కలిగితే ప్రాణాంతకమే అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తాటిచెట్లనుంచి కల్లు తీసే గీతకార్మికులు ఒకప్పుడు తెలంగాణలో 8 లక్షల మంది వరకు ఉండేవారు.కానీ చెట్లపైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు ఎక్కువ కావడంతో గీత కార్మికుల సంఖ్య ఇప్పుడు 1.9 లక్షలకు తగ్గిపోయింది. 2014 నుంచి 2024 మధ్యకాలంలో 5480 మంది గీత కార్మికులు చెట్లపై నుంచి జారిపడిపోగా, వారిలో 775 మంది ప్రాణాలు కోల్పోయారు. 1974 మంది శాశ్వత వికలాంగులయ్యారు. 2731మంది గాయపడ్డారు. గత రెండేళ్ల లోనే 130 మంది ప్రాణాలు కోల్పోగా, 710 మంది గాయపడ్డారు. 120 మంది శాశ్వతంగా వికలాంగులయ్యారు. ఈ ప్రమాదాలకు సంబంధించి బాధితులకు రూ.12.96 కోట్లు నష్టపరిహారంగా చెల్లించవలసి వచ్చిందని కల్లు గీత కార్మిక సంఘం (టాడీ టాపర్స్ అసోసియేషన్) వెల్లడించింది. కల్లుగీత కార్మిక కుటుంబాలకు చెందిన ఇప్పటి యువతరం గీతకార్మిక వృత్తికి దూరంగా ఉంటున్నారు.

చదువు పూర్తి కాగానే ప్రాణాలకు భద్రత కలిగించే వేతనాలు ఎక్కువగా లభించే వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కల్లుగీత కార్మికులు కొందరు చెట్లపైనుంచి కల్లు తీయడం జరుగుతోంది. అయితే నగరాల్లో ఉండే కల్లు కాంపౌండ్ నిర్వాహకులు గ్రామీణ గీతకార్మికులకు బదులుగా స్వంత కార్మికులను ఏర్పాటు చేసుకుని కల్లును తీయిస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడో దూరంగా ప్రభుత్వం కేటాయించిన చెట్లనుంచి కల్లు తీసి నగరాలకు తీసుకురావడం రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతుండంతో కొంతమంది కల్లు కాంపౌండ్ నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. మత్తు రసాయనాలు కలిపిన కల్తీ కల్లును విక్రయించి లాభాలు పిండుకోవాలని చూస్తున్నారు. కొంతమంది అర్బన్ కల్లు కాంపౌండ్ వ్యాపారులు తాము బీహార్ నుంచి గీత కార్మికులను బాడుగ కింద రప్పించి కల్లు తీయిస్తున్నామని రికార్డుల్లో నమోదు చేస్తున్నా అవన్నీ బోగస్ వివరాలని బయటపడ్డాయి.

కల్తీ కల్లు కల్లోలం ఇప్పుడు కొత్తేమీ కాదు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక విషాద సంఘటనలు జరగడంతో కల్లు కాంపౌండ్‌లను నిషేధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల కల్లు కాంపౌండ్‌లకు తిరిగి ప్రాణం వచ్చింది. నిపుణులు ఈ సమస్యకు పరిష్కారం ఎన్‌టిఆర్ ప్రభుత్వం అమలు చేసిన వారుణి వాహిని పథకాన్ని తిరిగి అమలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలను నెలకొల్పి కల్లును సేకరించి ఎలాంటి మత్తు పదార్ధాలు లేకుండా పండ్ల ఉత్పత్తులతో ప్రాసెస్ చేస్తుంది. ఎక్సైజ్ విభాగం కట్టుదిట్టమైన పర్యవేక్షణతో ఈ ప్రక్రియ సాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News