Sunday, August 31, 2025

గాడి తప్పుతున్న భావితరం

- Advertisement -
- Advertisement -

వారం రోజుల క్రితం జరిగిన కూకట్‌పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో ఈ హత్య కేసుకు సంబంధించిన కొన్ని నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 14 ఏళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం సహస్రను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పదవ తరగతి కూడా పూర్తికాని 14 ఏళ్ల బాలుడు 11 ఏళ్ళ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేయడం ఏంటి? ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటనే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి. అంత చిన్న వయసులో హత్య చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటగా యూట్యూబ్‌లో క్రైమ్ సంబంధిత వీడియోలు పిల్లలకు కూడా సులభంగా అందుబాటులో ఉండడం, ఇంటర్నెట్ వాడకం విషయంలో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వలన పిల్లలు అతిగా మొబైల్ వినియోగించడంతో వారు ఇలాంటి హింసాత్మక విషయాలపట్ల ఆకర్షితులై అమానుషమైన సంఘటనలకు పాల్పడేందుకు దారితీస్తున్నాయి.

బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం పక్కా ప్రణాళికతో అవసరమైతే హత్య చేయడానికైనా వెనకాడకూడదన్న ఉద్దేశంతో ముందుగానే తన ప్రణాళికను స్క్రిప్ట్ రూపంలో రాసుకుని దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగించేలా చేసింది. 14 ఏళ్ళ బాలుడికి స్క్రిప్ట్ రాసుకుని దొంగతనం చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది క్రైమ్ సంబంధిత వీడియోల ప్రభావమే అని చెప్పాలి. అంతే తప్ప ఏ తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలు చేయమని తమ పిల్లలకు చెప్పరు. మరి క్రైమ్ సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో లభ్యమవుతున్నాయంటే తప్పు ఎవరిది అనే విషయంపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిర్ధారించిన తర్వాత ఈ విషయంపై అన్ని న్యూస్ చానల్స్ జరిగిన సంఘటన గురించి సవివరంగా చెప్తున్నారు. కానీ నిందితుడి పేరు, ఫోటో, ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు.

దానికి వారు చెప్పే సమాధానం చట్టం ప్రకారం మైనర్ నిందితుడి వివరాలు, ఫోటో వెల్లడించకూడదని. చట్టం ప్రకారం నిందితుడిని చూపించకూడదన్న విషయం నికార్సయిన నిజం అయినప్పటికీ, మైనర్ నిందితుడు హత్య చేసిన సంఘటన సవివరంగా న్యూస్ చానెల్స్‌లో వెల్లడించడం కూడా ప్రమాదమే. వారు చెప్పిన ప్రతి విషయాన్నీ మరో పిల్లాడు చూసి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నేరాలు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో, న్యూస్ ఛానెల్స్‌లో కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హత్య చేసిన బాలుడిని శిక్షించడం సరైనదే. కానీ ఆ బాలుడు హత్య చేయడానికి ప్రధాన కారణం క్రైమ్ వీడియోస్ అన్న విషయాన్ని విస్మరించకూడదు.

ఈ సంఘటనకు కారణమైన ఆ క్రైమ్ వీడియోస్ వెబ్‌సైట్ దారుడిని కూడా న్యాయస్థానం శిక్షిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం వేచిచూడాల్సిందే. ఏమీ తెలియని పిల్లాడికి ఆ వెబ్‌సైట్ ద్వారా హత్య చేయాలనే ఆలోచన రావడం, అందువల్ల అతని జీవితంతో పాటు సహస్ర లాంటి వారెందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు రాబోవు కాలంలో పునరావృతం కాకుండా ఉండాలంటే సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాలు సినిమా రంగం వరకే వ్యాపించింది. కానీ నేడు అది పాఠశాలల వరకు విస్తరించింది. వాటికి అలవాటు పడుతున్న పిల్లలు దారుణంగా ప్రవర్తిస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు చిన్న వయసులోనే తమ బిడ్డలకు కార్లు, బైకులు అప్పగిస్తున్నారు.

గంజాయి మత్తుకు బానిసలై బైక్‌లపై విచ్చలవిడిగా తిరుగుతూ వారు ఎదుటివారి ఉసురు తీస్తున్నారు. కొంతమంది పిల్లలు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధిస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు పాఠశాలలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.గతంలో క్రైమ్‌కి సంబంధించిన సినిమాలు కట్టడి చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అందుకు సెన్సార్ బోర్డు చర్యలను సమర్థించుకుంటూ మానవ సమాజంలో నేరాలపై అవగాహన తీసుకురావడానికి మాత్రమే ఇలాంటి చిత్రాలు తయారు చేస్తున్నామని సమాధానమిచ్చారు. అంతేకాకుండా మంచి సినిమాలతోపాటు, క్రైమ్ సంబంధిత సినిమాలు కూడా చేస్తుంటే మరి మంచి సినిమాల ద్వారా ఎందుకు ప్రభావితం కావడం లేదన్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఏదిఏమైనా క్రైమ్ సంబంధిత వీడియోలు కట్టడి చేయడం ద్వారానే ఇలాంటి దుశ్చర్యల కట్టడి సాధ్యమనేది ముమ్మాటికీ నిజం. మొబైల్ ఫోన్ ఇప్పటి పిల్లల జీవితంలో భాగం అయిపోయింది.

పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఫోన్‌కి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ పని చేయనిదే ఇల్లు గడవని పరిస్థితి. ఈ హడావుడి బతుకుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు ఉండట్లేదు.మరికొందరి తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు మొదలు అడిగిందల్లా కొనిచ్చి అతి గారాబం చేస్తున్నారు. స్కూల్‌లో టీచర్ కొడుతుందన్న భయం లేకపోవడం ముఖ్యకారణం. ఒకప్పుడు పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణతోపాటు టీచర్ల పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు టీచర్స్ కొట్టాలంటేనే భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఏమంటారో అని. అలాంటి చిన్నారులు సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ గేములు, ఒటిటిల్లో హింసాత్మక చిత్రాలకు అలవాటు పడుతూ తీవ్ర మానసిక, శారీరక సమస్యలకు గురవుతున్నారు.

కొందరు దారుణ నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్రికెట్ బ్యాట్‌ను దొంగిలించడానికెళ్లి బాలికను దారుణంగా హత్య చేసిన వార్త విన్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దొంగతనం ఎలా చేయాలనే దానిపై నెట్‌లో వెతికిన ఆ కుర్రాడు ఇంట్లోకి వెళ్లాలి, గ్యాస్ లీక్ చేయాలి… అంటూ కాగితంపై రాసి పెట్టుకున్న పథకం ఒక క్రైమ్ సినిమాను తలపిస్తోంది. గత సంవత్సరం నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేశారు. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసే ఉత్సాహంలో తాము ఈ నేరానికి పాల్పడ్డామని వారు చెప్పారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లల్లో దుష్ట ప్రవృత్తి ప్రబలంగా ఉందనేది అక్షర సత్యం. కానీ ఆ పాపం ఎవరిది తల్లిదండ్రులదే కదా? పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడమే కదా దీనికంతటికి కారణం.

రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లల జీవితాలు ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి? దేశం సరైన మార్గంలో నడవాలంటే, అది చదువుకున్న పిల్లలతోనే సాధ్యమవుతుంది. మరి పిల్లలే తప్పుడు మార్గంలో నడుస్తుంటే దేశ భవిష్యత్తు ఏం కావాలి?. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం 2016 లో దేశవ్యాప్తంగా ఆయా నేరాల్లో పట్టుబడిన మైనర్లు 32.5% మంది ఉండగా, 2022 నాటికి పట్టుబడిన మైనర్ల సంఖ్య దాదాపు యాభై శాతానికి పెరిగింది. ఒక్క ఢిల్లీలోనే హత్యలతో ప్రమేయమున్న మైనర్ల సంఖ్య 2014- 24 మధ్య 8. 7% నుంచి 26. 78 శాతానికి పెరిగిందంటే రాబోవురోజుల్లో దేశభవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి. పైన చెప్పబడిన అంశాలపై విస్తృత చర్చ జరిగితేనే మార్పు కొంతమేరకు సాధ్యం అనే విషయాన్ని పాలకులు, తల్లిదండ్రులు, సభ్యసమాజం గమనించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించాలి.

Also Read : పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సీతక్క

  • కోట దామోదర్
    93914 80475
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News