‘ఆశలు, ఆకాంక్షలు ఉంటేనే, ఆందోళన ఉంటుంది. అవేవీ లేనప్పుడు అశాంతి ఉండదు. అంతా ప్రశాంతతే..’ చైనా ప్రజల్లో మేం గమనించిన ప్రధాన అంశం ఇదే. చైనాలో భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానివే, ప్రజలకు దాచుకునే అవకాశమే లేదు. గ్రామాలన్నీ అటు పల్లె వాతావరణం, ఇటు పట్టణ వాతావరణ కలగలిసి సెమీ అర్బనైజ్డ్ గా ఉంటాయి. అన్ని ప్రాంతాలకూ విశాలమైన రోడ్లు, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక్కో మనిషికి 10 గుంటల చొప్పున భూమి ఇస్తారు. తమ భూమిని చాలామంది కంపెనీలకు లీజుకిస్తారు. ఆ కంపెనీలు ఈ భూముల్లో పండ్లు, కూరగాయలు, వ్యవసాయ పంటలు పండిస్తుంటాయి. పండిన పంటలు పాడైపోకుండా, ప్రతి గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.
దాదాపు అన్ని గ్రామాల్లో పరిశ్రమలు నెలకొల్పారు. చైనాలో ప్రధానంగా పారిశ్రామికీకరణకు పెద్దపీట వేశారు. పరిశ్రమల్లో మానవ వనరులు (Human resources) సరిపోవడం లేదు. దీంతో అక్కడ రోబోలు కూడా పనిచేయడం చూస్తుంటే మాకందరికీ ఆశ్చర్యమేసింది. ప్రభుత్వానికి రాబడి ఆదాయం ఎక్కువ. దీంతో ప్రభుత్వమే పూనుకొని పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను 50 ఏళ్లకు సరిపడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగింది. చైనా దేశమంతటా ఏ ప్రాంతంలో చూసినా మాకు అందమైన గ్రామాలు, రోడ్లు, డ్రైనేజీలతో, క్రమబద్ధంగా అభివృద్ధితో, పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా విరాజిల్లుతూ కనిపించాయి. ప్రజలు తమ సంపాదనంతా ఖర్చు పెడుతుంటారు. బ్లాక్ మనీకి ఆస్కారం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి గానీ, బాధగానీ కనిపించలేదు. చైనా ప్రజలంతా కష్టించు, పనిచేయి, సంపాదించు, అనుభవించు అనే సూత్రాన్నే పాటిస్తుంటారు.
దీంతో ఎవరి పని వారిదే, ఎవరి జీవితం, ఎవరి సౌఖ్యం వారిదేలాగా ఉంటుంది. ప్రజలందరికీ చేతినిండా పని ఉంటుంది. తిండి లేకుండా, పనిలేకుండా ప్రజలెవరూ కనిపించరు. దీంతో వారికి ప్రభుత్వంతో ఘర్షణలుండవు. ప్రభుత్వం తమకేదో చేస్తుందని ప్రజలెవరూ ఎదురు చూడరుగాక చూడరు. ఉచిత పథకాలు ఉండవు. విద్య, వైద్యం, నీటి సరఫరా ఇవేవీ కూడా ఉచితం కాదు. చైనాలో మతం, దేవుళ్లు, గుళ్లు, గోపురాలు, విగ్రహాలు ఉండవు. ప్రజలంతా ఒకే భాష, ఒకే జాతి సూత్రాన్ని అనుసరిస్తుంటారు. తియాన్మెన్ స్క్వేర్ ప్రాంతంలో రోజుకు రెండుసార్లు ఆ దేశ పతాకాన్ని ఆవిష్కరిస్తుంటారు. అక్కడ ప్రెస్, మీడియా ఉండదు. ప్రభుత్వమే ప్రధాన పత్రికల కోసం వార్తలను, ఫొటోలను విడుదల చేస్తుంటుంది. చైనాలో ప్రభుత్వ అధికార కార్యక్రమాలే వార్తలు. మరే వార్తలూ ఉండవు.
రాజకీయాలు చూడొద్దు, రాజకీయ విషయాలు వినొద్దు, రాజకీయాల గురించి మాట్లాడొద్దు అనే రీతిలో ప్రజలు ఉండటం మాకు కనిపించింది. అన్ని పరిపాలనా విభాగాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిధ్యం ఉంటుంది. పార్టీ నుంచి ఎన్నికైన ప్రతినిధులే ఫుల్ టైమ్ వర్కర్లుగా పాలనా విభాగాల్లో సభ్యులుగా ఉంటారు. దీంతో అవినీతి, అక్రమాలు తావుండదు. ఎక్కడో కొంత అవినీతి ఉన్నట్లున్నా కనిపించదు. పోలీసులు ఎక్కడా కనిపించరు. కానీ, కార్లు, టాక్సీలు, బస్సులు, రైల్వేల్లో మొత్తం సిసి కెమెరాలతో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. దీంతో నేరాలు తక్కువగా జరుగుతాయనే చెప్పాలి. చైనాలో మాతృస్వామ్య వ్యవస్థను మేం గమనించాం. అలవోకగా బతుకు బండి నడవదు, కుటుంబంలో అందరూ పనిచేస్తేనే ఆ కుటుంబం గడుస్తుందని భావిస్తుంటారు. మహిళలెవరూ కూడా పనిచేయకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోరు.
ప్రతి ఒక్కరూ పనిలోనే ఉంటారు. మహిళలే కుటుంబాలను నడుపుతుంటారు. ప్రజలకు సరైన సంపాదన ఉన్నది, సుఖ సౌఖ్యాలు లభిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ. 50 వేల ఆదాయం వస్తుంది. దీంతో వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రజలు పాషనేట్‌గా అందమైన జీవితాన్ని గడుపుతారు. చైనా దేశంలో మహిళలు ఎంతో సౌందర్యంగా ఉంటారు. వీరు అలంకార ప్రియులు. అయినప్పటికీ ఏ ఒక్క మహిళ చూపుల్లో, ప్రవర్తనలో తేడా ఉండదు, అశ్లీలత అసలే కనిపించదంటే అతిశయోక్తి కాదు. ఆడపిల్లలను కన్న కుటుంబాలకు చైనాలో అమితమైన గౌరవం ఇస్తుంటారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చైనాలో చాలా ప్రాంతాల్లో కన్యాశుల్కం కూడా అమల్లో ఉన్నది.
నగరాల్లోని నైట్ క్లబ్బుల్లో పబ్ కల్చర్ ఉన్నప్పటికీ ఎక్కడా అశ్లీలత కనిపించదు. స్టాండర్డైజ్ హాస్పిటల్ ట్రీట్‌మెంట్. విద్య, వైద్యం విషయాల్లో ఇక్కడిలాగా భయంకరమైన ఫీజులుండవు. ఇవి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. ఒకే దేశం చైనా, ఒకే భాష చైనీస్ సూత్రాన్ని ప్రజలందరూ ఆచరిస్తుంటారు. మరోటి చూడరు, వినరు, మాట్లాడరు. ఇతర దేశాల్లో పర్యటించే చైనీయులు కూడా వ్యాపార పనుల్లోనే వస్తారు తప్ప టూరిజం ప్యాకేజీలతో రావడం బహు అరుదు. ఇతర దేశాలకు ఉద్యోగాలకోసం వెళ్లిన చైనా ప్రజలకు కూడా విపరీతమైన దేశభక్తి ఉంటుంది. అలాగే, చైనా సందర్శనకు వచ్చే పర్యాటకులపై కూడా ప్రభుత్వ నిరంతర నిఘా ఉంటుంది.
చైనా ప్రజలంతా విపరీతమైన క్రమశిక్షణతో చైతన్యవంతంగా ఉంటారు. మా 13 రోజుల పర్యటనలో వేలాది మందిని కలిశాం. వారందరితో మాట్లాడాం, కానీ, ఒక్క క్రమశిక్షణా రాహిత్య సంఘటనను మేం చూడలేదంటే అతిశయోక్తి కానేకాదు. ఎవరిలోనూ ఆవేశం, అసహనం, ఆగ్రహం కనిపించలేదు. చైనా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ జీరో క్రైమ్ రేట్ నమోదవుతున్నది. ప్రభుత్వ యూనివర్శిటీలు సకల సౌకర్యాలతో, అన్ని మౌలిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. నిరంతరం అప్ డేటెడ్ తాజా సమాచారంతో, వినూత్న ఆవిష్కరణలతో చైనా దేశంలోని విశ్వవిద్యాలయాలు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి. చైనాలో వ్యవసాయ సుక్షేత్రాలు ఎక్కువ. రిచ్ టవర్స్, రిచ్ పీపుల్ కనిపిస్తారు. ఇక్కడ 1990లో మొదలైన అభివృద్ధి 2000 సంవత్సరంలో వేగం అందుకున్నది. 2025 నాటికి అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది.
రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. షాంఘై నగరంలో వెయ్యి కిలోమీటర్ల మెట్రో, 500 మెట్రో స్టేషన్లతో నెలకొల్పారు. ప్రజలంతా మెట్రో వాడతారు. ప్రభుత్వమే 51% వాటాతో ప్రజలతో కలిసి వ్యాపారం నిర్వహించడం మరో విశేషం. కంపెనీలు వ్యవసాయం మొదలుకొని అన్ని వ్యాపారాలు నిర్వహిస్తాయి. వ్యాపార రంగంలోనే సంపాదన అధికంగా ఉంటుంది. యావత్ దేశం మీద భయంకరమైన నిఘా కనిపించకుండానే ఉంటుంది. తియాన్మెన్ స్వ్కేర్ సంఘటనను చైనా ప్రజలు ఒక పీడకలగా అభివర్ణిస్తుంటారు.చైనాలోని షియాంగ్ నగరం 11వ శతాబ్దానికి చెందిన ప్రాచీన నగరమైతే, ప్రస్తుతం అభివృద్ధి చెందిన నగరం బీజింగ్, అదే విధంగా అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్న షాంఘై నగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తుంటారు.
ఈ మూడు నగరాలూ మానవ నిర్మిత అద్భుతాలు, ఈ మూడూ భౌగోళికంగా త్రిభుజాకార దిక్కుల్లో ఉంటాయి. భూగర్భంలో రైలు మార్గం ఉంటుంది, దానిపైన రోడ్లు ఉంటాయి, ఆపైన ఎటు చూసినా ఫ్లై ఓవర్లు ఉంటాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అనే మాటే ఉండదు. ఇక్కడ మేం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దాదాపుగా 1200 కిలోమీటర్లు ప్రయాణించాం. చైనా వాల్, టెర్రాకోట్ మ్యూజియం, లైవ్ షోస్, షియాంగ్ సిటీలో 14 కిలోమీటర్ల గోడ, ఇండస్టీస్, ఫీల్డ్స్, బీజింగ్ ఫారెస్ట్, తియాన్ మెన్ స్వ్కేర్, యూనివర్శిటీలు, స్కూల్స్ ఇలా ఎన్నెన్నో చూశాం. దేశమంతటా నిఘా ఉన్నప్పటికీ, మాకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రజలంతా చైనా భాషలోనే మాట్లాడారు తప్ప, ఏ ఒక్కరూ ఇంగ్లీష్ పదాన్ని కూడా ఉచ్ఛరించకపోవడం మాకే ఆశ్చర్యమేసింది. చైనాలో విద్యా వ్యవస్థను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
పాఠశాలలన్నీ సకల సౌకర్యాలతో ఉంటాయి. ప్రజలు, ప్రభుత్వం మార్షల్ ఆర్ట్‌కు ప్రాధాన్యతనిస్తారు. పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి. ఇక తిండి విషయానికొస్తే అత్యధిక పోషక విలువలున్న ఆరోగ్యకరమైన తిండి ఇక్కడి ప్రజల ప్రత్యేకత. చైనా పర్యటనలో మేం మూడు పూటలా శుభ్రంగా 15 వంటకాలు తిన్నా మాకు ఏనాడూ కడుపు నిండినట్లుగా అనిపించకపోవడం విశేషం. సముద్రంలో లభించే చేపలతో రకరకాల రుచులతో వండే సీ ఫుడ్స్ నోరూరిస్తాయి. స్ట్రీట్ ఫుడ్స్‌కు ఆదరణ ఎక్కువ.ప్రజలు మామూలు నీళ్లు తాగరు. ఎక్కువగా వేడి నీళ్లు, ఆకులు, ఔషధ మొక్కల వేర్లు, నిమ్మకాయ ముక్కలు వేసుకొని మంచినీరు తాగుతారు.
చైనాలో ప్రభుత్వం ఏనాడూ ఓట్ల కోసం పనిచేసేది ఉండదు, కాబట్టి ప్రభుత్వానికి ఏ టెన్షనూ ఉండదు. ఉచిత పథకాలు ఉండవు కాబట్టి, ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా ఉండదు. చైనాలో ప్రజలు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారే తప్ప, భక్తి, పూజలు, పునస్కారాలు ఉండవు. ప్రతి వ్యక్తీ ఉత్పాదక రంగంలోనే పనిచేస్తారు. చైనాలో మేం చూసిన పర్యాటకుల్లో 99 శాతం మంది చైనీయులే కావడం మరో విశేషం. ప్రభుత్వ విధానాలు, ప్రజల జీవనశైలికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండానే ఉంటాయి. ప్రస్తుతం చైనా దేశ ప్రజలంతా కొత్త సంస్కరణలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు. 2040 నాటికి అమెరికా డాలర్ ద్రవ్య విలువను అధిగమించే లక్ష్యంతో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది.
- తక్కెళ్లపల్లి రవీందర్ రావు
(శాసనమండలి సభ్యులు)