Thursday, September 4, 2025

శాంతి కావాలా.. సమరమా?: చైనా అధినేత

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాలు తేల్చుకోవాలన్న చైనా అధినేత జిన్‌పింగ్ 
ఒకరికొకరు సామరస్యంగా సహకరించుకోవాలని ఉద్బోధ 
జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు గడిచిన సందర్భంగా భారీ క్షిపణులు, ఆయుధాలతో పాటవ ప్రదర్శన 

బీజింగ్ : చైనా దేశ పునరుజ్జీవనం ఆపలేనిదని, ఈ మేరకు వ్యూహాత్మక మద్దతు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ( పిఎల్‌ఎ) అందించాలని, తద్వారా ప్రపంచ శాంతికి, పురోగతికి విస్తృతంగా కృషి చేయవలసిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం పిలుపునిచ్చారు. ప్రపంచం ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, శాంతాయుద్ధమా, చర్చలాఘర్షణా, ఏం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్ పెరేడ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచస్థాయి శక్తిగా చైనా మిలిటరీ తనకు తాను నిర్మించుకోవాలని, జాతీయ సార్వభౌమత్వానికి, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతకు రక్షణగా ఉండాలని సూచించారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా విజయం సాధించిన చరిత్ర చైనాదేనని పేర్కొన్నారు. మానవ నాగరికత రక్షణకు, ప్రపంచ శాంతి పరిరక్షణకు యుద్ధంలో చైనా ప్రజలు అసమాన త్యాగాలు చేశారని కొనియాడారు. ప్రపంచం లోని దేశాలు ఒకరికొకరు సమానంగా, సామరస్యంగా, పరస్పర మద్దతుగా వ్యవహరిస్తే సాధారణ భద్రతను కాపాడుకోవచ్చని, యుద్ధానికి మూలకారణం తొలగించవచ్చని సూచించారు. దేశ సైనిక సామర్థాలను మరింత పెంచుతామని, ప్రతిజ్ఞ చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడంలో సైనికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తైవాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు.

ఈ ఆయుధ ప్రదర్శనలో తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి 26 దేశాల నేతలు హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక తియానన్మేన్ స్కేర్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ హాజరయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News