Saturday, July 5, 2025

సాంకేతిక సామర్థంతో చైనా బెదిరింపు

- Advertisement -
- Advertisement -

సెల్ ఫోన్లు దగ్గరనుంచి ఔషధాలకు ఉపయోగించే మూలకాల విషయంలోనూ చైనాపైనే భారత్ ఆధారపడుతుండడం గత కొన్ని దశాబ్దాలుగా పరిపాటిగా సాగుతోంది. భారత్ ప్రభుత్వం స్వదేశీ తయారీ, ఆత్మనిర్భర్ అనే నినాదాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన ఇంజినీర్లనే ఆయుధంగా చైనా ఉపయోగించి భారత్‌ను బెదిరిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ తన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని విస్తృతంగా పెంచుకోవలసిన అవసరం ఏర్పడింది. చైనా ఇటీవల ఐ ఫోన్ తయారీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ కు చెందిన భారతీయ పరిశ్రమల్లోంచి చైనా ఇంజినీర్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశించడం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. ఫాక్స్‌కాన్ సంస్థ చైనా లోను, అంతర్జాతీయంగా ఎన్నో కేంద్రాలను నెలకొల్పి పేరుగడించిన ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థ.

తమిళనాడు, కర్ణాటక ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీల్లోని సిబ్బందిలో చైనా ఇంజినీర్ల భాగం 1 శాతం కన్నా తక్కువే అయినప్పటికీ, వారెంతో కీలకమైన ఇంజినీరింగ్ పాత్రను నిర్వహిస్తున్నారు. వారిని వెనక్కి తీసుకోవడంలో చైనా అసలు ఉద్దేశం ఈ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే. దీంతోపాటు భారత్ పారిశ్రామిక అవసరాలకు ముఖ్యమైన క్లిష్టమైన యంత్రాలను సరఫరా చేయడంలో విపరీత జాప్యం కలిగించాలన్న ఎత్తుగడ కూడా ఉంది.ఇది ఒక విధంగా ఆర్థికపరమైన బెదిరింపు. అంతర్జాతీయ సంస్థల (International organizations) కార్యకలాపాలను అణగదొక్కడానికి, వారి ఉత్పత్తి స్థావరాలను మార్చడానికి చైనా తన తయారీ సామర్థ వ్యూహాలను అమలు చేస్తుంటుంది. అమెరికాతో వాణిజ్య యుద్ధ తీవ్రతను తగ్గించడానికి చైనా ఇటీవల ప్రయత్నించినప్పటికీ, దాంతో సంబంధం లేకుండా చైనా అమెరికా వ్యూహాత్మక ఆర్థిక పోరాటంలో చిక్కుకోవడంతో భారత్ వంటి దేశాలు ఇరుకున పడుతున్నాయి. అమెరికాతో వియత్నాం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో అమెరికాకు ఎగుమతి అయ్యే వియత్నాం ఉత్పత్తులపై 20 శాతం సుంకం విధించడానికి అమెరికా నిర్ణయించింది.

అయితే వియత్నాం మీదుగా అమెరికాకు వెళ్లే చైనా ఉత్పత్తులపై 40 శాతం సుంకం విధిస్తోంది. అంటే చైనా ఉత్పత్తులను నిరోధించడానికే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా తన వాణిజ్య భాగస్వాముల ద్వారా రాయితీలను భారీగా పొంది తన మార్కెట్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, చైనా తన వాణిజ్య భాగస్వాములను తన ఉత్పత్తుల సరఫరా గొలుసులో బంధించడానికి తన తయారీ సామర్థాన్ని వినియోగిస్తోంది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా సభ్యత్వం పొందిన తరువాత పశ్చిమ దేశాలు, చైనా అవ్యక్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. చైనా నూతన ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి తయారీపై దృష్టి కేంద్రీకరిస్తుండగా, తక్కువ విలువ గలిగిన తయారీని మిగతా దేశాలకు వదిలివేసింది. ఈ అవకాశాన్ని చైనా బాగా వినియోగించుకుని భారీ స్థాయిలో తన ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు సరఫరా చేయడం, వివిధ విభాగాల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవడంలో ముందుంటోంది.

ఇంతే కాకుండా ప్రపంచం మొత్తం మీద లభించే చైనాలోనే అత్యధిక శాతం అపురూప ఖనిజాలు లభిస్తున్నాయి. వీటిని 90 శాతం వరకు చైనా శుద్ధి చేయగలుగుతోంది. ఇక భారత్ విషయానికి వస్తే చైనా సరఫరా చేసే ఎపిఐ (అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌నెస్), ఎలక్ట్రానిక్ పరికరాల భాగాలు, కెమికల్స్, మ్యాగ్నెట్లు, మొదలైనవి ఎంతో బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఈ విధంగా చైనాపై ఆధారపడడాన్ని బాగా తగ్గించుకోవాలంటే ఉత్పత్తి అనుసంధాన రాయితీలు (పిఎల్‌ఐ) పథకాలను భారత్ ఎంతో ఆశాజనకంగా తీర్చిదిద్దాలి. స్వదేశీ తయారీని, సరఫరాను పటిష్టంగా రూపొందించడానికి చాలా అవసరాలు తీర్చవలసి ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యపై సునిశిత పరిశీలన తప్పనిసరి. భారత్‌లో ఏటా 1.5 మిలియన్ ఇంజినీర్లు తయారవుతున్నారు. వీరిలో 10 శాతం మంది మాత్రమే 2024లో ఉద్యోగాలు పొందగలిగారు.

ఇంకా మరికొన్ని అంచనాల ప్రకారం భారత్‌లో ఏటా 6 లక్షల మంది ఐటి ఇంజినీర్లు తయారవుతున్నారు. అయితే పరిశ్రమలకు కావలసింది మెటీరియల్ ఇంజినీర్లు. పరిశ్రమ ఉత్పత్తుల తయారీకి వీరి అవసరం చాలా ఉంది. కానీ వీరి సంఖ్య తగినంతగా లేదు. ఈ ఇంజినీర్ల వాసి, రాశి పెంచుకోవాలంటే ఆయా సాంకేతిక రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టడం, ఆ మేరకు పాలనా విధానాలు అమలు చేయడం ఎంతో అవసరం. చైనా నుంచి సాంకేతికంగా నైపుణ్యంలోనూ, కీలక ఉత్పత్తుల సరఫరా లోనూ ఎదురవుతున్న సవాళ్లను, బెదిరింపులను ఎదుర్కోవాలంటే భారత్ ముందు చూపుతో నైపుణ్యంతో కూడిన సాంకేతికతను అభివృద్ధి చేయాలి. నిదానంగా తన సాంకేతిక నైపుణ్యంతో తయారీ రంగాన్ని విస్తరింప చేసుకోవాలి. లేకుంటే కీలకమైన యంత్రాల విడిభాగాల తయారీ, సరఫరాలో చైనా ముందు భారత్ దుర్బలంగా మారుతుంది.

అయితే ఇటీవల భారత ప్రభుత్వం రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్, ఉద్యోగాల కల్పనకు ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్ల వరకు వెచ్చించడానికి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమైన ఉద్దేశం అని చెప్పవచ్చు. వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించాలన్నదే ఈ పథకం లక్షం. ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకంతోపాటు ప్రైవేట్ రంగ ఆవిష్కరణల కోసం తయారీ రంగం, ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పన, తదితర రంగాలను ప్రోత్సహించడానికే ఈ అద్భుతమైన ప్రణాళిక అని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటివి సత్ఫలితాలు అందిస్తే చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వర్ధిల్లుతుందని ఆశించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News