సెప్టెంబర్ 3న జరగనున్న చైనా విజయదినోత్సవ 80 వ వార్షిక పెరేడ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ యున్, తదితర 26 మంది విదేశీ నేతలు పాల్గొననున్నారు. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా (ఫాసిస్ట్ వ్యతిరేక ) జరిగిన యుద్ధంలో చైనా విజయం సాధించినందుకు, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపును గుర్తు చేసుకుంటూ ఈ సైనిక కవాతు నిర్వహిస్తున్నట్టు చైనా గురువారం వెల్లడించింది. అయితే ఈ పెరేడ్‌కు ప్రపంచ నాయకులు ఎవరూ హాజరు కావద్దని జపాన్ అభ్యర్థించడం దౌత్యపరమైన చిచ్చు రగిలించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
ఆహ్వానంపై 26 మంది విదేశీ నేతలు హాజరవుతారని చైనా సహాయ విదేశాంగ మంత్రి హాంగ్ లీ పేర్కొన్నారు. తియాన్‌జిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు షాంఘై కోఆపరేషన్‌ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) సదస్సు నిర్వహించిన తరువాత బీజింగ్‌లో పెరేడ్ నిర్వహిస్తారు. షాంఘై సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలందరినీ పేరేడ్‌లో హాజరయ్యే విధంగా చైనా ప్రయత్నిస్తుండడం జపాన్‌కు ఆగ్రహం తెప్పించింది. విజయదినోత్సవ పెరేడ్ పేరుతో జపాన్ వ్యతిరేక కార్యక్రమాలను చైనా నిర్వహిస్తోందని జపాన్ ఆరోపిస్తోంది. అందులో పాల్గొన్న నాయకులను అత్యంత జాగ్రత్తగా గమనించడమౌతుందని పేర్కొంది.