శ్రీనగర్: శనివారం అర్థరాత్రి జరిగిన క్లౌడ్ బర్ట్స్ కారణంగా జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) కథువా జిల్లా అతలాకుతలం అవుతోంది. జంగ్లోటే ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ జల ప్రళయానికి ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. కథువా పోలీస్ స్టేషన్‌పై కూడా వరదలు ప్రభావం చూపించాయి. జిల్లాలోని జోద్ గ్రామంలో ఆరుగురు గ్రామస్థులు వరదల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానిక యంత్రాంగం, కేంద్ర బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి జతేంద్ర సింగ్ కథువా ఎస్పి శోభిత్ సక్సేనాతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు (Jammu Kashmir) కిస్త్‌వాడ్ జిల్లాలోని చసోటి ప్రాంతం భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. శిథిలాల నుంచి ఇప్పటివరకు 50 మృతదేహాలను వెలికి తీసినట్లు సిఎం వెల్లడించారు. కుల్లు ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. రాజౌరీలో వరదలకు ఇళ్లు కొన్ని కూలిపోగా, కొన్ని దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.