Wednesday, September 17, 2025

ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. ఇళ్లు, రోడ్లు ధ్వంసం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ సంభవించింది.డెహ్రాడూన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోనూ మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. పలువురు గల్లంతయ్యారు. వరదతోపాటు వచ్చిన బురద ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, రహదారుల పైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక వంతెన కొట్టుకుపోయింది. డెహ్రాడూన్‌లో ప్రవాహ ఉధ్ధృతికి ఐదుగురు కొట్టుకుపోయారు. 584 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. తమ్సా, టన్స్, సాంగ్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తమ్సా నది గట్టుపైన తాపకేశ్వర ఆలయం ఉంది. తమ్సానదితోపాటు గంగా,యమున నదులు ప్రమాద స్థాయికి చేరువలో ఉన్నాయి. తమ్సానది వేగంగా ఉప్పొంగుతోంది. ఆలయాన్ని, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నున్న భారీ హనుమాన్ విగ్రహాన్ని వరదనీరు ముంచెత్తింది. హనుమాన్ విగ్రహం భుజాల వరకు వరద నీరు చేరింది.

నదీ జలాలు ఈ విధంగా ఉద్ధృతంగా పెరిగిపోతుండడం గత 30 ఏళ్లలో తాను చూడలేదని ఆలయ పూజారి బిపిన్ జోషి ఆందోళన చెందారు. నదీ ప్రవాహం ముంచెత్తే సమయంలో అదృష్టవశాత్తు ఆలయంలో కొద్ది మంది మాత్రమే భక్తులు ఉన్నారని , ఆలయంలో ఉన్న పూజార్లు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లోని 300 నుంచి 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి వినోద్ కుమార్ తెలియజేశారు. డెహ్రాడూన్ లోని పౌంధ ఏరియా లోని దేవభూమి ఇనిస్టిట్యూట్ ఆవరణలో నీరు నిలిచిపోవడంతో దాదాపు 200 మంది పిల్లలు చిక్కుకున్నారు. వారిని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రక్షించిందని డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫర్మేషన్ బన్సీధర్ తివారీ పేర్కొన్నారు. రిషికేశ్‌లో చంద్రభాగానది ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. టెహ్రీలో నీరు నిల్చిపోవడంతో గీతాభవన్‌లో చిక్కుకున్న ప్రజలను తరువాత రక్షించారు. నైనిటాల్‌లో కొండచరియలు విరిగి అడ్డంగా పడిపోవడంతో రహదారి దిగ్బంధమైంది. మఝ్రా గ్రామం లోని నివాసాలపై కొండచరియలు పడిపోవడంతో ఇళ్లను విడిచిపెట్టి ఆ గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. కొంతమంది గల్లంతయ్యారని చెబుతున్నారు. సాంగ్ నది ఉప్పొంగి పరిసరాలు జలమయమయ్యాయి. దీంతో మాల్‌దేవత బ్రిడ్జి ప్రమాదంలో పడింది. డెహ్రాడూన్ ఐటి పార్క్ ఏరియా లోని అనేక కార్యాలయాల్లో నీరు చేరింది.

వరద ప్రవాహంలో బోల్తా పడిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు
మంగళవారం డెహ్రాడూన్ లోని నదిని దాటడానికి ప్రయత్నించగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు నదిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న 10 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. నదిలో కొట్టుకుపోయిన వారంతా కూలీలని , ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా, ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మరో ప్రాంతంలో స్వర్ణ నదికి సమీపంలో వరదల్లో చిక్కుకున్న ఓచిన్నారిని ఎన్డీర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు డెహ్రాడూన్, ముస్సోరీ మాల్ లోని పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా సహాయక బృందాలు దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

పరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పర్యటన
డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్నమాల్‌దేవత, కేశర్వాలా ప్రాంతాలలో మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పర్యటించారు. భారీ వర్షాల వల్ల అన్ని నదులు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. 25 నుండి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయని, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి రెస్కూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో విధ్వంసమైన ప్రాంతాల పరిస్థితిని ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి ధామి తెలియజేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలోని వరద బాధిత ప్రజలను కేంద్రం ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చినట్టు పేర్కొంది.

Also Read: 16 వేల మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించనున్న కేంద్రం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News