గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన చారిత్రక తప్పిదాల దుష్ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విమర్శించారు. పాకిస్థాన్‌ను 1971 యుద్ధంలో చిత్తుగా ఓడించడం చారిత్రాత్మక పరిణామం అయింది. ఈ దశలో బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పట్లో భారత్‌కు అనేక సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పరిస్థితిని దుర్వినియోగపర్చారని, సరైన విధంగా నిర్వహించలేకపోయారని విమర్శించారు. దీనితో ఇప్పుడు మనం ప్రత్యేకించి ఈశాన్య భారతంలో గడ్డు పరిస్థితిని ఇప్పటికీ అనుభవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పట్లో బంగ్లాదేశ్ ఏర్పాటు దశలో ‘భారత్‌కు పాక్ బెడద శాశ్వత స్థాయిలో లేకుండా చేసేందుకు అనువైన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజకీయ నాయకత్వ లోపం , ప్రత్యేకించి ఇందిరా గాంధీ పాత్రతో మనం దెబ్బతిన్నామని ఆరోపించారు. ఇప్పుడు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ , అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వానికి కట్టుబడి పనిచేయడం మోడీ రాజకీయ వైఫల్యం అని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విమర్శలకు దిగుతున్న దశలో అసోం సిఎం నుంచి ఈ ఎదురుదాడి వెలువడింది. అప్పట్లో భారతీయ సైన్యం వీరోచిత పోరు త్యాగాలు , బలిదానం తరువాత బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటు పరిణామం భారత్‌కు ఎటువంటి బెడద , ముప్పునకు దారితీసిందనేది అందరికీ తెలిసిందే అని సిఎం వ్యాఖ్యానించారు.