Wednesday, July 30, 2025

భూ వివాదం.. సుప్రీంకోర్టులో సిఎం రేవంత్కు ఊరట

- Advertisement -
- Advertisement -

ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను కొట్టివేత
పిటిషనర్, న్యాయవాదిపై సిజె ఆగ్రహం
కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: భూ వివాదంలో సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టీస్ బి.ఆర్.గవాయ్ ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాకుండా పిటిషనర్, అతని తరఫు న్యాయవాదిపై సిజె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ వారికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. ఈ కేసును మొదట హైకోర్టు కొట్టివేయగా, దానిని సవాల్ చేస్తూ పిటిషన్‌దారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టీస్‌పై పిటిషన్‌దారు చేసిన అభియోగం పట్ల సిజె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కేసు పూర్వాపర్వాలు ఇలా ఉన్నాయి. గోపన్‌పల్లిలో సర్వే నెం. 127లోని 31 ఎకరాలకు సంబంధించి ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీకి, రేవంత్ రెడ్డి సోదరుడు ఎ. కొండల్ రెడ్డి, ఎ. లక్ష్మయ్య మధ్య 2020 లో జరిగిన వివాదంలో ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి అప్పడు ఎంపిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో సోసైటీ స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టి వేయాలంటూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం సరైన ఆధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఇటీవల కొట్టివేసింది. హైకోర్టు తీర్పు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దారుడు పెద్ది రాజు ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం రేవంత్‌రెడ్డికి ఇందులో సంబంధం ఉన్నట్టు సాక్షాధారాలు లేవని వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది.

పిటిషనర్, న్యాయవాదికి ధిక్కరణ నోటీసులు జారీ
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్, న్యాయవాది రితేష్ పాటిల్‌పై సిజెఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిటిషన్‌లో హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరక వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేసేటప్పుడు పరిశీలించుకోవాలని, ఒక న్యాయవాదిగా ఉంటూ న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని సిజెఐ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిటిషనర్ పెద్దిరాజుతో పాటు, ఆయన న్యాయవాదికి ధిక్కరణ నోటీసులు జారీ చేయగా, కోర్టు సాక్షిగా పిటిషనర్ తరపున న్యాయవాది రితేష్ పాటిల్ ధర్మాసనాన్ని క్షమాపణ కోరారు. పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోరగా, సిజెఐ అందుకు నిరాకరించారు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలన్నారు. పిటిషన్ దాఖలు చేసేముందు పరిశీలించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదిపై ఉంటుందని వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కరణ నోటీసులపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని, సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని సిజె గవాయి స్పష్టం చేశారు. ఈ కేసును ఆగస్ట్ 11వ తేదీకి వాయిదా వేస్తూ, ఈ సారి విచారణకు పిటిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఆదేశించారు.

ఇది కేసు నేపథ్యం
గోపన్ పల్లిలో సర్వే నెం. 127లోని 31 ఎకరాలకు సంబంధించి వివాదంలో ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీకి, రేవంత్ రెడ్డి సోదరుడు ఎ. కొండల్ రెడ్డి, ఎ. లక్ష్మయ్యల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఎన్ పెద్దిరాజు 2016 సంవత్సరంలో అప్పటి ఎంపిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో సోసైటీ స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ది రాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను కోట్టి వేయాలంటూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గతంలోనే జస్టిస్ మౌసమి భట్టాచార్య విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి లేకున్నా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని, రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పెద్దిరాజు 2014 వ సంత్సరంలోనే చందానగర్‌లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు కోట్టివేదసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు.

పెద్దిరాజు తిరిగి 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, 8 మంది సాక్షుల వాంగ్మూలంలో రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరని చెప్పారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మాసనానికి వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం నిందితుడికి సంఘటనతో సంబంధం ఉన్నట్లు ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయిందని పేర్కొన్నారు. ఆరోపణల ఆధారంగా కేసు నమోదయిందని, నిందితుడు సంఘటనా స్థలంలో ఉన్నట్లు నిరూపించకుండా దోషిగా నిర్ధారించడానికి ఆరోపణలు ఆధారం కావని ధర్మాసనం తెలిపింది. కాగా, ధర్మాసనం తీర్పు ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ఫిర్యాది దారుడి తరుపున వాదించిన నాయ్యవాది, సుప్రీంకోర్టులో బదిలీ దరఖాస్తు దాఖలు చేయబడిందని, ఈ విషయాన్ని హైకోర్టులోని మరో బెంచి ఎదుట విచారణ జరిపించాలని కోరారు. తాజాగా ఈ బదిలీ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సిజెఐ ధర్మాసనం కేసు కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News