Tuesday, July 8, 2025

తెలంగాణలో ఒలింపిక్స్ క్రీడలు

- Advertisement -
- Advertisement -
  •  2036లో కనీసం రెండు ఈవెంట్లు నిర్వహించాలి
  • వచ్చే ఏడాది ఖేలో ఇండియా గేమ్స్‌ను నిర్వహించాలి
  • రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించండి
  • క్రీడాకారులకు రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి
  • ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మాండవీయను కలిసి వినతిపత్రం అందజేసిన సిఎం రేవంత్ 
  • సిఎంను కలిసిన బాలీవుడ్ హీరో అజయ్‌దేవగన్, కపిల్‌దేవ్ 
  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని దేవగన్ విజ్ఞప్తి
  • యంగ్ ఇండియా స్పోర్ట్ వర్శిటీలో భాగస్వామినవుతానని కపిల్ ప్రతిపాదన

మనతెలంగాణ/హైదరాబాద్: ‘ఖేలో ఇండియా గేమ్స్- 2026’ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ ఎల్.మాండవీయను ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. ఖేలో ఇండియా కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణులఎంపిక ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేట్‌లో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్‌బి స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ అభివృద్ది, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ నవీకరణ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్నివిధాలా కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని సిఎం కోరారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్‌లో కనీసం రెండు ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణాల్లో ఛార్జీ రాయితీ ఇవ్వాలని సిఎం కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఎపి జితేందర్ రెడ్డి, ఎంపిలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ కు దేవగన్ విజ్ఞప్తి

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవగన్, ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌లు మర్యాద పూర్వకంగా వేర్వేరుగా కలుసుకున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగన్ విజ్ఞప్తి చేశారు. సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, విఎఫ్‌ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సిఎం రేవంత్ రెడ్డి అజయ్ దేవగణ్‌కు వివరించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

తెలంగాణలో క్రీడా రంగం అభివృద్ధిపై కపిల్ దేవ్ ప్రశంస…
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కపిల్ దేవ్ సోమవారం కలిశారు. ఈ సంద ర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు వివరించారు. యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామిని అవుతానని కపిల్‌దేవ్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శిం చిన క్రీడా యూనివర్సిటీలు అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సిఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News