బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎంఎల్‌ఎలు తామేమీ పార్టీ మారలేదని శాసనసభా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానమివ్వాని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే వీరిలో ఇద్దరు ఎంఎల్‌ఎలు స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా తామేమీ పార్టీ మారలేదని, కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాధానమిచ్చారు. ఇదే మాదిరి సమాధానాన్ని మిగతా 8 మంది ఎంఎల్‌ఎలు కూడా ఇవ్వాలని తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎంఎల్‌ఎలు (మాజీ మంత్రి కడియం శ్రీహరి మినహా) సమావేశమయ్యారు. ఇందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు స్పీకర్ నుంచి అందిన నోటీసులపై ఏ విధంగా సమాధానమివ్వాలి అన్న అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఓ వైపు సుప్రీం ఆదేశాలు.. మరోవైపు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
నుంచి అందిన నోటీసుల నేపథ్యంలో వీరు ముఖ్యమంత్రితో అత్యవసరంగా సమావేశమై సమాలోచనలు జరిపారు. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలెదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌కు సూచించడం, ఈ మేరకు స్పీకర్ నుంచి నోటీసులు అందుకోవడంతో ఏ విధంగా పదవీ గండం నుంచి బయటపడటానికి ఉన్న ప్రత్యామ్నాయాలపై వీరు చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇద్దరు ఎంఎల్‌ఎలు న్యాయనిపుణుల సలహా మేరకు తామేమీ పార్టీ మారలేదని, తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా తమకు శాలువాలు కప్పారే తప్ప.. అవేమీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అన్నీ కోణాలు, తాజాగా న్యాయ నిపుణుల సలహా మేరకు మిగతా ఎంఎల్‌ఎలు కూడా ఇదే విధమైన సమాధానం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
ఇలా ఉండగా ఆదివారం సాయంత్రం సిఎంతో సమావేశం ముగిసినానంతరం కొందరు ఎంఎల్‌ఎలు మీడియాతో మాట్లాడుతూ
తమ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి పనులపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. స్పీకర్ నుంచి తమకు అందిన నోటీసులకు తాము సిఎంతో సమావేశం కావడానికి ఎలాంటి సంబంధం లేదని తోసిపుచ్చారు.
ఇలా ఉండగా ఈ అంశంపై న్యాయనిపుణులతో మరింత లోతుగా చర్చించి రెండ్రోజుల్లోగా లిఖిత పూర్వకంగా స్పీకర్‌కు సమాధానమిచ్చేందుకు మిగతా ఎంఎల్‌ఎలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరినందున రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి పూర్తి ఆధారాలతో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే కనీసం వారికి నోటీసులు కూడా
ఇవ్వలేదని బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదన వినిపించారు. అనర్హత పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సూచించింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం పార్టీ ఫిరాయింపు ఆరోపణలెదుర్కొంటున్న ఎంఎల్‌ఎలకు ఈ నెల 2వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, తమకు ఈ గడువు సరిపోదని, మరో 10 రోజుల గడువు కావాలని ఎమ్మెల్యేలు కోరగా అవకాశం కల్పించారు. స్పీకర్ విధించిన గడువు ముగియడానికి మరో 5 రోజుల మాత్రమే గడువు ఉంది. దీంతో ఎంఎల్‌ఎల ఇచ్చే సమాధానంతో స్పీకర్ సంతృప్తి చెందుతారా? లేక వీరిని ఎంఎల్‌ఎ పదవికి అనర్హులుగా ప్రకటిస్తారా? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.