హైదరాబాద్: భూమికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని.. రాష్ట్రంలోని అన్ని పోరాటాలు భూమి చుట్టు తిరిగాయని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లో గ్రామ పాలన అధికారులకు సిఎం స్వయంగా నియాపక పత్రాలు అందజేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూశాఖ సిబ్బంది ఉవ్వెత్తున పాల్గొన్నారని.. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర సాధనలో ఆర్టిసి, సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
‘‘ఉద్యమంలో పాల్గొన్న సిబ్బందికి గత సిఎం మేలు చేస్తారని అందరూ ఆశించారు. కానీ, గత ప్రభుత్వ హయాంలో సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదు. ప్రజలను దోచుకున్నది రెవెన్యూ ఉద్యోగులే అన్నట్లు గత ప్రభుత్వం చిత్రీకరించింది. ధన, భూదాహంతో భూమిని చెరబట్టాలని ధరణి తీసుకొచ్చారు. ధరణి వివరాలు ప్రజలకు తెలియకూడదని విఆర్‌వో, విఆర్‌ఎలను తొలగించారు. విఆర్‌వొ వ్యవస్థను తొలగించకపోతే వారి దుర్మార్గాలు తెలుస్తాయని భావించారు. ఎన్నికల ముందు ఎవరిని పలకరించినా ధరణి సమస్యలు విన్నవించేవారు. ధరణిని బంగాళఖాతంలో పడేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాను’’ అని సిఎం (Revanth Reddy) తెలిపారు.
రెవెన్యూశాఖ కావాలని పొంగులేటి అడగలేదని.. వారి సమర్థత గుర్తించిం ఇచ్చామని రేవంత్ పేర్కొన్నారు. ‘‘ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని.. భూభారతితో తొలగించే ప్రయత్నం చేశాం. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదు. ప్రజలకు ధరణి వల్ల సమస్యలు వచ్చాయి. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే జివివొలు అందుబాటులో ఉండాలి. సాదాబైనామాల సమస్యలను గ్రామపాలన అధికారులు పరిష్కరించాలి. ఎంత మంచి వ్యవస్థ అయినా.. ఒక 5 శాతం తప్పులు జరుగుతాయి. ఏదైనా తప్పు జరిగితే వ్యవస్థను మొత్తం రద్దు చేస్తామా? ఇంట్లో ఎలుక దూరితే దాన్ని చంపుతామా?.. ఇంటిని తగలబెడతామా?’’ అని సిఎం ప్రశ్నించారు.
రెవెన్యూ ఉద్యోగులు దుర్మార్గులు అనేలా గత ప్రభుత్వం చిత్రీకరించిందని సిఎం మండిపడ్డారు. ‘‘రెవెన్యూ వ్యవస్థలో ఏదో చిన్న తప్పులు జరిగాయని రద్దు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకు కూలిపోయింది.. మరి వాళ్ల పార్టీని రద్దు చేస్తారా? గ్రామపాలన అధికారులు సక్రమంగా పని చేస్తారని కేబినెట్‌కు హామీ ఇచ్చాను. భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకోవడం అసాధ్యం. నిజాంలకు ఏ విధంగా గుణపాఠం చెప్పారో.. గత ప్రభుత్వ పాలకులకు అలాంటి గుణపాఠం చెప్పారు’’ అని సిఎం పేర్కొన్నారు.
Also Read : చదివితేనే భవిష్యత్ కాదు.. క్రీడల్లో రాణించినా భవిష్యత్ ఉంటుంది: రేవంత్