Sunday, August 31, 2025

కెసిఆర్‌కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలని దురాశ కలిగిందా?: సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శాసనసభలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఉత్తమ్ ప్రసంగం తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తోందని హరీశ్ మండిపడ్డారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ అంశంపై ప్రసంగించారు. 2015 మార్చిలో కేంద్రమంత్రి ఉమాభారతి రాష్ట్రానికి లేఖ రాశారని.. హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని.. 205 టిఎంసిలు అందుబాటు ఉందని లేఖలో పేర్కొన్నారని సిఎం తెలిపారు.

‘‘ప్రాణహిత-చేవెళ్ల కట్టుకోవచ్చని 2015లోనే ఉమాభారతి లేఖ రాశారు. దురాశ, దోపిడీతో మళ్లీ విచారణ చేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వం కోరింది. మొత్తం వ్యవస్థలను హరీశ్ రావు తప్పుదోవ పట్టించారని కమిషన్ చెప్పింది. తప్పుడు సమాచారాన్ని పదేపదే హరీశ్‌రావు చెబుతున్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 2014లో లేఖలు రాశారు. నీళ్లు ఉన్నాయని చెప్పినా మీరెందుకు వినలేదు. తెలంగాణ ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లు దోచుకునేందుకే ఇలా చేశారు’’ అని సిఎం రేవంత్ (Revanth Reddy) మండిపడ్డారు.

మహారాష్ట్రతో జరిగిన చర్చ ప్రాజెక్టు ఎత్తు గురించే అని సిఎం స్పష్టం చేశారు. ‘‘ముంపు ప్రాంతం తగ్గుతుందనే ఎత్తు తగ్గించుకోవాలని మహారాష్ట్ర కోరింది. మేడిగడ్డ వద్దే కట్టాలని అప్పటికే కెసిఆర్, హరీశ్‌రావు నిర్ణయం తీసుకున్నారు. 2005లోనే ప్రాణహిత-చేవెళ్లను తుమ్మిడిహట్టి వద్ద కట్టాలని బిఆర్‌ఎస్ నేతలు కోరారు. కెసిఆర్‌కు నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే దురాశా కలిగిందా? మేడిగడ్డ వద్దే ప్రాజెక్టు కట్టాలని సిఎం చెప్పారని కమిటీ సభ్యులు చెప్పారు. మీరు నియమించుకున్న ఇంజినీర్లు కూడా మేడిగడ్డ వద్ద కట్టవద్దన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను కావాలనే తొక్కిపెట్టారు. అన్ని అంశాలను చీఫ్ ఇంజినీర్ హరిరామ్ స్పష్టంగా చెప్పారు’’ అని సిఎం పేర్కొన్నారు.

తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చి రూ.లక్ష కోట్లు దోపిడి చేశారని సిఎం అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై సిడబ్ల్యూసి రాష్ట్రానికి అనేక లేఖలు రాసింది. ప్రతిపాదిత ప్రాజెక్టును మరోసారి చెక్ చేయాలని సిడబ్ల్యూసి చెప్పింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దని సిడబ్ల్యూసి చెప్పినా మరి ఎందుకు కట్టారు?’’ అని సిఎం గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Also Read : లక్ష కోట్లు ఖర్చు చేసి.. లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: ఉత్తమ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News