హైదరాబాద్: రాష్ట్ర నీటి హక్కులను కెసిఆర్, హరీశ్ రావు కాపాడుతారని అందరూ భావించారని.. కానీ, వాళ్లే రాష్ట్రానికి నష్టం చేశారని సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు, ఎంపిలు, కార్పొరేషన్ ఛైర్మన్ల పాల్గొన్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. 811 టిఎంసిల్లో తెలంగాణకు 299 టిఎంసిలు చాలని 2015లో సంతకం చేశారని, 68 శాతం జలాలు ఎపికి కేటాయిస్తే అభ్యంతరం లేదని సంతకాలు చేశారని మండిపడ్డారు. సంతకాలు చేసి మన హక్కులను ఎపికి ధారదత్తం చేశారని అన్నారు. కెసిఆర్, హరీశ్‌రావుల సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారయని విమర్శించారు.
కృష్ణా పరివాహకం ప్రాంతం పరంగా చూస్తే.. తెలంగాణకే ఎక్కువ దక్కాలని.. కానీ కేటాయించిన 299 టిఎంసిలు కూడా వాడుకోలేని పరిస్థితి తీసుకువచ్చారని సిఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఉమ్మడి ఎపిలో ప్రారంభించిన ప్రాజెక్టులను పదేళ్లపాటు పట్టించుకోలేదని.. ఎపి మాత్రం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులకు నీటిని తరలించుకుపోతోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఎపిలో రూ.38 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్లను చేపట్టారని.. కానీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కెసిఆర్ కాళేశ్వరం చేపట్టారని అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం చేపట్టారని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుతో 168 టిఎంసిలు మాత్రమే ఎత్తిపోశారని, అందుకు రూ.7 వేల కోట్ల కరెంట్ బిల్లు ఖర్చయిందని తెలిపారు. ఎత్తిపోసిన 168 టిఎంసిలలో 112 టిఎంసిలు మళ్లీ కిందకు వదిలారని అన్నారు.
ఎపిని బూచీగా చూపి బిఆర్‌ఎస్‌ను బతికించేందుకు కుట్రలు చేస్తున్నారని సిఎం మండిపడ్డారు. గోదావరిలో 3 వేల టిఎంసిలు వృథాగా పోతున్నాయని కెసిఆర్ మాట్లాడారని.. కేటాయించిన నీరు వాడుకోకుండా వృథా పోతున్నాయని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే మిగులు జలాలు ఎక్కడ ఉంటాయన్నారు. మిగులు జలాలతోనే బనకచర్ల కట్టుకుంటున్నామని ఎపి చెబుతోందని తెలిపారు. కెసిఆర్ మాటలతోనే గోదావరి నీటిని సీమకు తరలించే ప్రయత్నాలను జగన్ చేపట్టారని అన్నారు. జగన్ సిఎంగా ఉన్నన్ని రోజులు ఎపి ప్రాజెక్టుల గురించి హరీశ్ రావు ఏం మాట్లాడలేదని దుయ్యబట్టారు. జగన్ దిగిపోయి చంద్రబాబు రాగానే జలాలా సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.