Tuesday, July 8, 2025

మంత్రుల పని తీరుపై సిఎం రేవంత్ సీరియస్

- Advertisement -
- Advertisement -

నిధులు, బాధ్యతలు మీ వద్దే ఉన్నా…నిర్లక్షమా
జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత మీదే..
గ్రామాల్లో పర్యటనకు నేను సిద్ధంగా ఉన్నా..
పార్టీ-ప్రభుత్వం జొడెద్దుల్లా పని చేయాలి ..
పదవుల కోసం గాంధీ భవన్‌లో ధర్నా చేస్తారా ?

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కొందరు మంత్రుల పని తీరు బాగా లేదు…జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి జాబితాలు సిద్ధం చేయడంలో జాప్యం చేస్తున్నారు. నిధులు, విధులు, బాధ్యతలు మీ వద్దే ఉన్నా నిర్లక్షం ఎందుకూ ? అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏఐసిసి నాయకురాలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ సమక్షంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం (పిఏసి) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కొంత మంది మంత్రుల పని తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల్లో పర్యటన చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. పార్టీ-ప్రభుత్వం జొడెద్దుల్లా పని చేయాలని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు కాబట్టి వారికీ సరైన గుర్తింపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు స్థానికంగా అంటే జిల్లాల్లో వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జీ మంత్రులు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ ఎందుకు జరగడం లేదోనని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీకి గ్రామ , మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన మంత్రులకు సూచించారు.

ధర్నాలు చేయడం ఏమిటీ?
పార్టీ పదవి కావాలని అడగడంలో తప్పులేదు కానీ గాంధీ భవన్‌లో ధర్నాకు దిగడం ఏమిటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. గాంధీ భవన్ ఆవరణకు గొర్రెలను తీసుకుని రావడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, పదవుల కోసం ధర్నాకు దిగితే వారిని చూసి మరొకరు ఇదే పద్ధతిని అవలంభిస్తారని, దీంతో పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరికగా అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధం కండి..
మనది గోల్డెన్ పీరియడ్ అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికకు సిద్ధం కావాలని ఆయన పార్టీ హైదరాబాద్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నా అంటూ ప్రకటనలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి నాయకులకు సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రమోషన్, పని చేయని వారికి డిమోషన్ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికగా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News