Tuesday, July 15, 2025

రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగం:సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చాయని, సమతుల్య విధానంతో ఈరోజు శ్రీమద్ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్- వన్ సినిమా నిర్మాణ షూటింగ్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం రామాయణ సీరియల్‌ను చిత్రీకరించి టెలివిజన్‌లో ప్రసారం చేసిన రామానంద్ సాగర్ ఒక చిరస్మరణీయ వ్యక్తి అని కొనియాడారు. టివిల్లో ఆ సీరియల్ వచ్చే సమయంలో ప్రజలెవ్వరూ రోడ్లపై ఉండేవారు కాదని, అందరూ ఆ సీరియల్ చూసేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సిరియల్ ను చిత్రీకరించిన రామానంద్ సాగర్‌కు సంబంధించిన మోతీసాగర్, అమృత్ ఆకాష్ మాట్లాడుతూ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మహా భాగవతం పార్ట్- వన్ సినిమా నిర్మాణాన్ని చిత్రీకరించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

రామాయణం సీరియల్ మాదిరిగానే ఈ భాగవతం మహాభారత చిత్రం కూడా అందరి ప్రశంసలు పొంది విజయవంతంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతమైన చిత్రాలను నిర్మించడంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకుందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చలమేశ్వర్, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, భగవత్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మోతీసాగర్, అమృత్‌సాగర్ చోప్రా, ఆకాష్‌సాగర్, రామోజి ఫిల్మ్ సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News