నా అంచనాలకు మించి సిఎం రేవంత్‌రెడ్డి
రాణించారు దేశంలో సామాజిక
న్యాయానికి ఇదో మైలురాయి కులాల
స్థితిగతులపై తెలంగాణ వద్ద సమగ్ర డేటా
ఈ స్థాయిలో బిజెపి సర్కార్ కులగణన
చేయలేదు తెలంగాణ కులగణనపై
ఎఐసిసి భవన్‌లో జరిగిన ప్రజెంటేషన్‌లో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిఎంపై
ప్రశంసల వర్షం కురిపించిన రాహుల్,
మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ఒత్తిడితో కేంద్రం దిగి వచ్చింది :
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
కులగణన వివరాలను ప్రియాంకతో
పంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : మా అంచనాలకు మించి కులగణనలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి రాణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. దే శంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని ఆయన కితాబిచ్చా రు. కులగణన నిర్వహించడం అంత తేలిక కాదన్నారు. గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన తెలంగాణలో నిర్వహించిన కులగణనపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన విజయవంతంగా చేపట్టారని, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని కొనియాడారు. ఆఫీసు రూముల్లో కూర్చుని కులగణన చేస్తే మంచి ఫలితాలు రావని, దీనికి నాయకుల అంకిత భావం, చిత్తశుద్ధి అవసరమని అది రేవంత్ రెడ్డి నిరూపించారని పేర్కొన్నారు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలతో పకడ్బందీగా నిర్వహించారని, ఇది
దేశంలో కులగణన నిర్వహణకు మార్గదర్శిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండియాలో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ఇది తాము చెప్పడం కాదని, బిల్‌గేట్స్, ట్రంప్ ఎవరిని అడిగినా ఇదే చెబుతారన్నారు. తెలంగాణ వద్ద 21వ శతాబ్దపు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమాచారం ఉందని తెలిపారు. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లు పూర్తిగా బీజేపీ భావజాలమన్నారు. జనగణనను సరైన రీతిలో బీజేపీ సర్కారు చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. దేశ అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి వారు ఇష్టపడరన్నారు. ధనం, భూమి ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలిపే డాటా తెలంగాణ చేతిలో ఇప్పుడు ఉందన్నారు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి ఒక విద్యకే ఉందని, ఇంగ్లీష్‌లో బోధన ఇప్పుడు దేశానికి అవసరమని ఆయన గుర్తు చేశారు. అలాగని తానేమీ హిందీ, ప్రాంతీయ భాషలు ముఖ్యం కాదని చెప్పడంలేదన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లీష్‌ను తీసేయాలని అంటున్నారని, వారి పిల్లలు ఏ భాషలో చదువుతున్నారో అడగాలని, దళిత, ఆదివాసీల పిల్లలు ఇంగ్లీషులో ఎందుకు చదవకూడదని ప్రశ్నించారు.
ఈ సర్వే దేశానికే ఆదర్శం : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే సక్సెస్ అయ్యిందని, ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొనియాడారు. ఈ సర్వే దేశానికి కొత్త దిశ చూపిందన్నారు. సాధారణంగా ఇలాంటి సర్వే చేయడానికి ప్రభుత్వాలు భయపడతాయని చెబుతూ గతంలో కర్నాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవరాజ్ ఆర్సు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి పూనుకున్నపుడు ప్రజలతో పాటు తమ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ ప్రతులను దగ్ధం చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవి పోయినా పర్వాలేదని, రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తామని ఆయన పట్టుదలతో ఆ పని చేశారన్నారు. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటకలో బీసీలు రాజకీయంగా చైతన్యవంతమయ్యారని చెప్పారు. ఎస్సీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే ఆ వర్గాలన్నీ కాంగ్రెస్ పక్షానే నిలుస్తాయని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీ స్థానంలో ఇంకో నాయకుడు ఉండి ఉంటే కులగణన అనే అంశాన్నే తీసుకునే వారు కాదన్నారు. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు తమ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కులగణన చేశాకే ప్రధాని మోడీ మేల్కొని దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. స్వతంత్ర నిపుణుల కమిటీ తమ ప్రభుత్వం నివేదికను లోతుగా అధ్యయనం చేశారని, ఆ కమిటీని ప్రశంసిస్తున్నానన్నారు. కుల గణన సర్వే ద్వారా తెలంగాణ ఎక్స్ రే తేలిందని, ఇక ఎవరెంతో వారికంత దక్కాలని అన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో ఎవరి వాటాలు వారికి దక్కాలని, ఇందుకు దేశమంతా డేటా బేస్ సర్వే జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ వర్గానికి అన్యాయం జరగొద్దన్నదే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ సామాజిక న్యాయం దిశగా వెళుతోందన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చితే రిజర్వేషన్ 60 శాతం దాటిందని తెలిపారు.
సోనియా ప్రశంస నాకు ఆస్కారం : సీఎం రేవంత్ రెడ్డి (బాక్స్ ఐటెమ్)
తెలంగాణలో విజయవంతంగా కులగణన సర్వే నిర్వహించడాన్ని ప్రశంసిస్తూ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనకు రాసిన లేఖ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది నోబెల్, ఆస్కార్ అవార్డు లాంటిదని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రంలో, రాహుల్ గాంధీ చెప్పిన హామీని అమలు చేసి చూపించామన్నారు. రాహుల్ తన మనసులో అనుకున్నది అమలు చేసి చూపించానని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. మొదట్లో జనగణనతో పాటు కులగణన చేసేందుకు కేంద్రం ముందుకు రాలేదన్నారు. తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను తాము 2024లోనే ప్రారంభించామన్నారు. తాను బీసీ నేతను అని ప్రధాని మోదీ పదేపదే చెప్పుకుంటున్నారని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని మరోసారి చెబుతున్నానని అన్నారు. మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదని విమర్శించారు.
కొన్ని విషయాల్లో మోడీ సర్కార్ దిగివచ్చేలా రాహుల్‌గాంధీ పోరాటం చేశారని, అందువల్లే మూడు రైతుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల, విద్య, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగిందని తెలిపారు. ఈ సమగ్ర సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశామని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద మూడు నెలలుగా పెండింగ్‌లో ఉందన్నారు. ప్రతి సామాజికవర్గానికి న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కులగణన సర్వేలో తెలంగాణ ప్రభుత్వం అరుదైన విధానం అవలంభించిందని, దేశానికే దిక్సూచిగా నిలిచే విధానంలో సర్వే నిర్వహించామని వివరించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, విజయవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్వేను ‘రేర్ మోడల్’ గా పేర్కొనవచ్చన్నారు. కులగణన పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వివరాలను సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని సీఎం వివరించారు.
బీసీల రిజర్వేషన్లు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు విజ్ఞప్తి చేశారు. వీటిని చట్టం చేసేందుకు పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదం కోసం పోరాడాలని కోరారు. అవసరమైతే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను ముందు నుంచి కాంగ్రెస్ లో లేనని, తనకు సీఎం కుర్చీ దొరికిందని కొందరు మిత్రులు అంటుంటారని, కానీ నేను కాంగ్రెస్ లోకి తరువాత వచ్చినా రాహుల్ గాంధీ ఆత్మతో కలిసిపోయానని, మమేకం అయ్యానని, రాహుల్ గాంధీ గుండె ఏమి కోరుకుంటుందో అదే తాను చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినంగా అభివర్ణించారు. కాంగ్రెస్ తోనే ఏదైనా సాధ్యమని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ఒత్తిడితో కేంద్రం దిగి వచ్చింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్రం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, ఎంపీలు పాల్గొన్నారు.
కులగణన వివరాలను ప్రియాంక గాంధీతో పంచుకున్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని కలిశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీతో భేటీ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రియాంక గాంధీ అభినందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు తాము అండగా ఉంటామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీతో కలిసిన ఫొటోను రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.