స్థానిక సమరంలో కాంగ్రెస్ శ్రేణుల విజయానికి నాదీ పూచీ
17పార్లమెంట్ స్థానాలు గెలిచితీరుతాం రైతురాజ్యం ఎవరు తెచ్చారో
తేల్చుకుందాం రండి ఎక్కడైనా చర్చకు సిద్ధం కెసిఆర్, కెటిఆర్,
కిషన్‌రెడ్డి ఎవరు వచ్చినా సరే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60వేల
ఉద్యోగాలు ఇచ్చాం వారందరినీ స్టేడియంలో హాజరుపరుస్తా ఒక్కరు
తగ్గినా మీ కాళ్లు మొక్కి తప్పుకుంటా ఎల్‌బి స్టేడియంలో జరిగిన
సామాజిక న్యాయ సమరభేరి సభలో కెసిఆర్, మోడీకి సిఎం రేవంత్ సవాల్
మన తెలంగాణ/హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో కాం గ్రెస్ కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రభుత్వం తరపున ప్రచారకర్తలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ సామాజిక న్యాయ సమరభేరీ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, ఎంపీ సీట్లు పెరగబోతున్నాయని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాయని, అందులో ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యత అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 15 లోక్‌సభ సీట్లు తప్పకుండా గె లుస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన ప్రసంగంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలను, కార్యకర్తలను ఉర్రూతలూగించారు. తమకు ఎదురులేదని భావించిన కల్వకుంట్ల గడీని బద్ధలు కొట్టామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని, ఇదే తరహా పాలన రా బోయే రోజుల్లోనూ సాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని తామంతా కొట్టుకుంటామని.. కలసి ఉండలేమని విపక్షాలు చేసిన ఆరోపణలను తప్పని నిరూపించామన్నారు. కాంగ్రెస్ నేతలు ఐకమత్యంతో పని చేస్తూ అపోహలను పటాపంచలు చేశారన్నారు. జనగణనతో పాటు కులగణన చేస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్‌గాంధీ మాట ఇచ్చారని, హామీ ఇచ్చినట్టుగానే ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 18 నెలల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్ ఆవిష్కరించామన్నారు. ఈ సమయంలో కష్టాలు వచ్చాయని, ఒడిదొడుకులు వచ్చాయని, అయినా అన్నింటిని అధిగమించి ముందుకెళ్తున్నామన్నారు.రైతుల కోసం 18 నెలల్లో రూ.1.04లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు.
వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని గత సీఎం చెప్పారని, 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి దేశానికే ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. రైతుభరోసాలో ప్రభుత్వం విఫలమవుతుందని కొందరు ఎదురు చూశారని, కానీ వారి ఆశ నెరవేరలేదన్నారు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో..ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధం అని సవాల్ విసిరారు. చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్, మోదీ, కిషన్‌రెడ్డి ఇలా ఎవరొచ్చినా సరే…అని సవాల్ విసిరారు. మేం తొలి ఏడాదిలోనే మేం 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేసీఆర్, మోదీకి సవాల్ విసురుతున్నానని, లెక్క కావాలంటే చెప్పండి.. అందరినీ తీసుకువచ్చి స్టేడియంలో నిలబెట్టి లెక్కవేయిస్తానన్నారు. 60వేలకు ఒక్కరు తక్కువ వచ్చినా కాళ్లు మొక్కి తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.మేము ఎక్కడైనా విఫలం అవుతామేమోనని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలకు చెంప పెట్టులాగా కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామని వెల్లడించారు.
గత ప్రభుత్వ నాయకులు రైతులు వరి వేస్తే ఉరి వేసుకోవాలని బెదిరించారని, తాము మాత్రం వరి పండించిన రైతులకు బోనస్ లు ఇచ్చి, రైతే రాజు అనే మాటను నిజం చేస్తున్నామని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ పేదలను దృష్టిలో ఉంచుకుని ఇళ్ళు, భూములు ఇచ్చిందని.. ప్రతి పేదవాని ఇంట్లో ఏదో రకంగా ఇందిరమ్మ పేరు వినిపిస్తూనే ఉందని తెలిపారు. అందుకే తాము ఎలాంటి పథకాలు మొదలు పెట్టినా ఇందిరమ్మ పేరు పెడతామని, పేదవాళ్ళ కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెడితే ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందిరమ్మ వలె ఆడపడుచులను తాము గౌరవిస్తామని, అన్ని పథకాల్లో మహిళలకే పెద్ద పీట వేస్తామన్నారు. మహాలక్షీ పథకం, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఇందిరా స్వయం సహాయక సంఘాలు…ఇలా అన్నిట్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్రంలో కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామని అన్నారు. తెలంగాణలో కులవృత్తుల పరంగా తెలంగాణ బిడ్డలు గొర్రెలు కాయమని, చేపలు పట్టుకోమని, చెప్పులు కుట్టుకోమని చెప్పి కేసీఆర్, కేటీఆర్ మాత్రం రాజ్య పాలన చేసే కుర్చీలో కూర్చుంటామని కుతంత్రాలు చేశారని మండిపడ్డారు. ‘
ఒక్క ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, ఈ పెట్టుబడుల ద్వారా యువతకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని, కాని తెలంగాణలో నెలకొల్పబోయే స్పోర్ట్ యూనివర్సిటీ ద్వారా భారత దేశానికి భవిష్యత్తులో తెలంగాణ యువత బంగారు పథకాలు తెచ్చి చూపిస్తారని మోడీకి సవాల్ విసిరారు. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు తమను గెలిపించారని, ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను, స్థానిక నాయకులను గెలిపించే బాధ్యత తనదే అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలు పెరగబోతున్నాయని, 119గా ఉన్న సీట్లు 150కిపైగా అవుతాయని, మిమ్మల్ని గెలిపించే బాధ్యత తనదన్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ రాబోతోందని, తెలంగాణ అమ్మలు, అక్కలు అసెంబ్లీలో, పార్లమెంటులో భారీగా గెలుస్తారని, తాము దగ్గర ఉండి వారిని గెలిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
.