Thursday, September 18, 2025

డిసెంబర్‌లో షురూ.. మూసీ ప్రక్షాళనపై సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ఎన్ని అడ్డంకులు ఎదురైనా..మూసీ ప్రక్షాళన చేసితీరుతాం
కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోం
2027 డిసెంబర్ 9 నాటికి ఎస్‌ఎల్‌బిసి పూర్తి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఏడాది డిసెంబర్‌లో మూసీ ప్రక్షాళన పనులు చేపట్టి, మూసీ చుట్టూ నివసిస్తున్న ప్రజలకు మెరుగైన జీవితాన్ని కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోమని కృష్ణానీటికోసం చేస్తున్న న్యాయపోరాటంలో ట్రిబ్యునల్ వద్ద తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ జీవనాడులని, ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదని ఆయన తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 904 టిఎంసీల వాటాను సాధించి తీరేలా వ్యూహారచన చేస్తున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా
2027 డిసెంబర్ 9 నాటికి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్)ను పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కారిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ప్రపంచానికి హైదరాబాద్ గేట్ వేగా మారుతుందని సిఎం రేవంత్ తెలిపారు. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేం మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోడ్లు, విద్యుత్, రహదారులు, రవాణా సదుపాయాలు, మురుగు నీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత ఇలా అన్నీ కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. సిఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

రూ.24 వేల కోట్ల అంచనాతో మెట్రో రెండో దశ విస్తరణ
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారబోతుందని అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్‌గా మారుతోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చే వందేళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలు తీసుకువస్తున్నామని, రూ. 7,360 కోట్లతో గోదావరి 2,3 దశల పనులను ఇటీవలే ప్రారంభించుకున్నామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. దీంతోపాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉండబోతున్నాయని ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై తలపెట్టిన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఒక గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుందన్నారు. రూ.24 వేల కోట్ల అంచనాతో మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం జరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘనత
ఈరోజు తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినమన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న చరిత్ర మనదని ఆయన తెలిపారు. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయమే నేడు మనమంతా అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని సిఎం పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానికి ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేశారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17వ తేదీ అని, అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది
ఈ స్వేచ్ఛా సాధన కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడబోమని చెప్పడానికి మన చరిత్రే సాక్ష్యంగా నిలుస్తోందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలుకొట్టి స్వేచ్ఛకు ఊపిరిపోసేందుకు ఊపిరి వదిలిన వందలాది మంది అమరవీరులకు నివాళ్లు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పఠిమను చాటారన్నారు. ఈ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని, అందుకే రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరా మహిళాశక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా ఆరు నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించారన్నారు. ఖమ్మం మహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తోందని, రాష్ట్రంలో మరికొన్ని మహిళ మార్ట్‌లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

విద్యతో పాటు స్పోర్ట్‌కు ప్రాధాన్యత
ప్రజాపాలనలో నేడు కష్టమైనా, నష్టమైనా ప్రజలతోనే పంచుకుంటున్నామని, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతూ తప్పులను సరిదిద్దుకుంటున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని, అందుకే యంగ్ ఇండియా స్కూల్స్‌కు శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నామన్నారు. అలాగే విద్యతో పాటు స్పోర్ట్‌కు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. విద్యలో రాష్ట్రం ముందుండేలా త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని ఆయన తెలిపారు.

25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,616 కోట్ల రైతు రుణమాఫీ
రైతన్నను రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరిత విప్లవం నుంచి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుంచి రైతు భరోసా వరకు రైతుల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయన్నారు. ఆ వారసత్వాన్ని ప్రజా ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,616 కోట్ల రైతు రుణమాఫీలు చేసి రుణ విముక్తుల్ని చేశామని, దేశంలో ఈ స్థాయిలో రైతు రుణమాఫీలు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చామని సిఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీపడలేదని, రాజీపడబోమని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ వరిని కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతును రాజును చేసేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

7,178 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల చివరి గింజను ధాన్యం కొన్నామన్నారు. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500ల బోనస్ ఇస్తున్నామని. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. గతేడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

మత్తు మాఫియాను తరిమికొడతాం
నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లోకి కూడా గంజాయి విస్తరిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు అండగా నిలబడితే తెలంగాణను పట్టి పీడిస్తోన్న మత్తు మాఫియాను తరిమికొడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో తీసివేస్తామని ఆయన తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని సిఎం ప్రశంసించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా వారిని కటకటాల వెనక్కి పంపి తీరుతామన్నారు. హైదరాబాద్‌ను కొందరు గేట్ వే ఆఫ్ డ్రగ్స్‌గా మార్చారని, ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామని సిఎం రేవంత్ హామీనిచ్చారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9వ తేదీన విడుదల చేసి, తెలంగాణ జాతికి అంకితం చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే వందేళ్ల కోసం ఈ విజన్ డాక్యుమెంట్‌ను రెడీ చేస్తున్నామని, ఈ విజన్ డాక్యుమెంట్ కోసం సలహాలు ఇవ్వాలని సిఎం కోరారు. ఫోర్త్ సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 180 మంది తెలంగాణ అభ్యర్థులకు ఆగష్టు 11వ తేదీన ఈ ఆర్థిక సాయం అందించామని, ఆర్థిక సాయం పొందిన వారిలో ఇప్పటివరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు
గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా గత పాలకులు ముద్ర వేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే భూ భారతి చట్టం తెచ్చామని, క్షేత్ర స్థాయిలో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఇటీవలే 5 వేల మంది గ్రామ పాలనా అధికారులను నియమించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తాయని సిఎం రేవంత్ తెలిపారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్లలో చూసిన ఆనందం తనకు ఎనలేని తృప్తిని ఇచ్చిందన్నారు. తొలి విడతగా రూ.22,500 కోట్లతో, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగున్నర లక్షల మంది పేదలు సొంత ఇంటివారవుతున్నారు.

Also Read: తీన్మార్ మరో పెరియార్ అవుతాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News