హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వానా కాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్‌కార్డు పంపణీపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల పరిధిలోని ఐఎఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం తెలిపారు. కలెక్టర్ల కార్యాచరణ రిపోర్టు రోజు తనకు పంపించాలని స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు పెట్టడానికి ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించాలని అన్నారు.
వాటర్ మేనేజ్‌మెంట్‌పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సిఎం రేవంత్ (Revanth Reddy) తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో 150 బృందాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా ముందుగానే టీమ్‌లను పంపిస్తున్నాం అని పేర్కొన్నారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పిహెచ్‌సి, ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారని ఆదేశించారు.
ఎరువులు దొరకడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిఎం ఈ సందర్భంగా అన్నారు. ‘‘షాప్‌లో ఎరువుల స్టాక్ ఎంత ఉందో బయట నోటీస్ బోర్డులో పెట్టాలి. ఎరువుల షాప్ వద్ద పోలీసులు, అధికారులు ఉండాలి. రాష్ట్రంలో ఎరువులు ఉన్నాయి.. ఆందోళన అవసరం లేదు. రాయితీపై ఇచ్చే ఎరువులను ఇతర వ్యాపారాలకు వాడుతున్నారు. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవు. ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయండి’’ అని సిఎం ఆదేశించారు.
సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని సిఎం హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలి. ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలి. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగాలి. కలెక్టర్లు, అధికారులు కూడా రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనాలి. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. ఆందోళన అవసరం లేదు’’ అని సిఎం స్పష్టం చేశారు.