భారత ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల మాజీ సిఎంలు కెసిఆర్, వైఎస్ జగన్ ల మద్దతు కోరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సిఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.
చంద్రబాబు, కెసిఆర్, జగన్, పవన్, అసద్‌లకు విజ్ఞప్తి చేస్తున్నానని.. రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని సిఎం రేవంత్ అన్నారు. ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆయనకు మద్దతు తెలపాలని కోరారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయకోవిదుడు అవసరమన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ పార్టీ ప్రతినిధి కాదని.. ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ఎన్డీయే అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని.. రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లు నమోదవ్వడమేంటి? అని సిఎం రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు.