Thursday, May 15, 2025

రెండేళ్లలో కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణంపూర్తి

- Advertisement -
- Advertisement -

తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల
నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలి
పాలమూరురంగారెడ్డిని ఉద్దండాపూర్ వరకు
పూర్తి చేయాలి సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూన్ నాటికి రాష్ట్రంలో కృష్ణా పై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా బేసిన్ లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవిన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలసౌధలో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,

మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్‌లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ లోగా పూర్తి చేయాలని సూచించారు. మహాత్మగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయాలని చెప్పారు. వీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా రాబట్టాలి
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని అన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు. గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా కోటా పెంచుకోవాలని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News