మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సుముఖంగా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము వచ్చేది లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ సమావేశం ఎజెండా మారిస్తే తాము కూడా హాజరవుతామని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి తెలపగా.. ఈ హుటాహుటి ప్రయాణానికి కారణం మాత్రం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశమేనని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన అంశాలు సమావేశపు అజెండాలో చేర్చాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలను పంపించింది. కాగా, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.