దోపిడీ సొమ్ము కోసం కత్తులు నూరుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్లు దోచుకున్నారు
అయినా.. ఆ కుటుంబంలో సంతోషం లేకుండా పోయింది ఆస్తుల పంపకాల పంచాయితీల్లోకి మమ్మల్ని లాగకండి కెసిఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సిఎం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దోపిడీ సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో కల్వకుంట్ల కుటుంబం కత్తులు దూసుకుంటోందని, ఆ కత్తులను తమపై దూయడం తగదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం, బెండాలపాడు గ్రామంలో బుధవారం ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధ్దిదారుల ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం దా మరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తూ ..నెలకు వెయ్యికోట్లు తగ్గకుండా 110 నెలల అధికారంలో ఉండి లక్ష కోట్లుకు పైగా దోచుకున్నారని ఆరోపించారు. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారని వ్యాఖ్యా నించారు. దోపిడీ సొమ్ము కారణంగానే మాజీ సిఎం కెసిఆర్ కుటుంబంలో చిచ్చుపుట్టిందని అన్నారు. బావ, బామ్మర్ది, అన్న, చెల్లి ఇంటిల్లిపాదీ ఎవరికివారు కత్తులు, బల్లేలు తీసుకుని వీపులో పొడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎంత సం పాదిస్తే ఏం లాభం.. దోపిడీకి సొమ్ము వాళ్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందని పడుకునేందుకు ఫామ్ హౌజ్ లు, చేసేందుకు వ్యాపారాలు, చూసేందుకు టివిలు, రాసుకునేందుకు పేపర్ ఇస్తే ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘మీ పంపకాల్లో పంచాయితీ వస్తే కుటుంబ పెద్ద దగ్గరకు వెళ్లండి ..తెగకపోతే కులపెద్ద దగ్గరికి పోండి …అక్కడ కూడా తెగకపోతే మంత్రగాడి దగ్గరకు పోండి ..అంతే తప్ప మీ కుటుంబ పంచాయితీలో మమ్మల్ని లాగకండి ‘ అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.2023లోనే ఆ కాలనాగును కట్టెతో కొట్టి చంపేశా.. ఇప్పుడు ఆ చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా ? బిఆరెఎస్ అనే కాలకూట విషం ఉన్న కాలనాగును ప్రజలు డిసెంబర్ 3, 2023న బండరాయితో మోది బొందపెట్టారు. చచ్చిన పామును మళ్ళీ చంపడం అవసరమా? అని ప్రశ్నించారు. ‘మాకు ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పని ఉంది.. సన్న బియ్యం ఇచ్చే పని ఉంది, పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పనుందని, రైతుభరోసా. రుణమాఫీలాంటి అనేక సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయాల్సిన పనుంది..కెసిఆర్ గురించి ఆలోచించే సమయం లేదు’ అని అన్నారు.
కెసిఆర్ దత్తత గ్రామానికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు: పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవారికి ఆత్మగౌరవం, భరోసా, ధైర్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. గత ప్రభు త్వం పేదలకు మంచి చేస్తే తమకు కమీషన్ రాదని భావించిందని, ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం పేదలను దేవుళ్లుగా భావిస్తోదని అన్నారు. నాటి సిఎం వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రోడ్లు వెడల్పు చేశారు. అందరికీ భోజ నాలు పెట్డారు…అవ్వా ఏమి కావాలని అడిగిన అవ్వకు ఇళ్లు ఇస్తా అని ఒక్కరికీ కూడా ఇళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వాసాల మర్రి గ్రామంలో నాటి సిఎం హామీ ఇచ్చిన బాధితులకు 119 ఇళ్లు మంజూరు చేశామని న తెలిపారు. కెసిఆర్ సొంత గ్రామం చింతమడక గ్రామంలో కూడా ఇళ్ళు ఇవ్వలేదని ఆ గ్రామ పేదలకు కూడా త్వరలో ఇళ్ళు ఇవ్వబోతున్నామని చెప్పారు.