Monday, August 25, 2025

ఒక్క పోలీసును పెట్టకండి.. నేను ఓయూకు ఎందుకు రావొద్దు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కళా విహీనంగా మారిన పరిస్థితి ఏర్పడిందని.. కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సిఎం ఓయూను సందర్శించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని.. ఓయూ నుంచే పివి ధిక్కార స్వరాన్ని వినిపించారని చెప్పారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు వేదికగా ఓయూ నిలిచిందన్నారు. ఉస్మానియా విద్యార్థిగా జైపాల్‌ రెడ్డి రాజకీయాల్లో రాణించారని.. ఓ జార్జిరెడ్డి, ఓ గద్దర్‌ను అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు.

చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారని.. తాను వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నానని సిఎం చెప్పారు. “విద్యార్థుల సమస్యలు తీర్చాలని అనుకుంటున్న నేను ఓయూకు ఎందుకు రావొద్దు. డిసెంబర్‌లో ఆర్ట్స్‌ కాలేజీలో మీటింగ్‌ పెట్టండి..నేను వస్తా. ఒక్క పోలీసును పెట్టకండి.. విద్యార్థులు నిరసన తెలిపినా నేను ఏమీ అనను. పేదల తలరాతలను మార్చేది విద్య ఒక్కటే.. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులను, శ్రీమంతులను చేస్తుంది.. మిమ్నల్ని ఇబ్బంది పెట్టేలా ఉండే నిర్ణయాలను వ్యతిరేకించండి.. నిరసన తెలపండి. కానీ, మీ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చేవారిని అడ్డుకోకండి.ఓయూను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తాం. అద్భుతమైన యూనివర్సిటీగా మార్చుదాం. ఓయూ లేకపోతే తెలంగాణ లేదు” అని సిఎం రేవంత్‌ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News