మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సెంట్రల్ యూనివర్సిటీలో సిం హాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అ భివృద్ధిని అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. లేని ఏనుగులు, సింహాలను తాను చంపేస్తున్నానని సోషల్ మీడియాలో దు ష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు అని, మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయని, అవి కూడా ఫామ్‌హౌస్‌లో ఉన్నాయంటూ ఘా టు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటి వారని అభివర్ణించారు.వాటిని నిర్బంధించడానికి వలలు వేయాలని అన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే ఉ స్మానియా యూనివర్సిటీని బతకనివ్వరు అని, ఒయులో లేఅవుట్లతో ప్లాట్లు వేస్తారని పేర్కొన్నా రు.
వాళ్లు తెలంగాణ సమాజం బాగు కోరుకోర ని అన్నారు. విద్యార్థుల కోసం పనిచేయని వారి ని వ్యతిరేకించాలని విద్యార్థులను కోరారు. కొం త మంది రాజకీయ నాయకులకు పదవులు పో యాయన్న ఆవేదన ఉంటుంది.. వాళ్ల కొడుకులను ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతున్నారని బాధ ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి ఉచ్చులో పడవద్దంటూ విద్యార్థులకు సిఎం హితవు పలికారు. సమస్యలుంటే తమకు చెప్పాలని, తమ మంత్రులు అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం విద్యార్థుల వసతి కోసం నిర్మించిన దుందుభి, భీమా హాస్టల్ భవనాలను సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
విద్యార్థిని, విద్యార్థుల కోసం నిర్మించతలపెట్టిన మరో రెండు హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ హాల్‌కు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రతిష్ఠాత్మక ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులనుద్దేశించి సిఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంఎల్‌సి కోదండరాం, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఒయు వైస్ ఛాన్స్‌లర్ కుమార్ మొలుగరం,ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి ఎంతో గొప్ప నాయకులు ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారే అని పేర్కొన్నారు. ఈ వర్సిటీకీ గొప్ప చరిత్ర ఉందని, వందేళ్లలో ఒయుకు విసిగా దళితుడిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. కేవలం కులం మాత్రమే కాకుండా నైపుణ్యాన్ని చూసి ప్రొఫెసర్ కుమార్‌ను విసిగా నియమించామని తెలిపారు. యూనివర్సిటీల ఉపకులపతులు, విద్యా కమిషన్, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయాన్ని పాటించామని చెప్పారు.
ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తా
ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలలు లాంటివని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా, ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయే అని పేర్కొన్నారు. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియానే అని, ఈ వర్సిటీ ఐపీఎస్, ఐఏఎస్‌లను అందించిందని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒక అద్బుతమైన విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యా శాఖ నిపుణలతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను సిఎం ఆదేశించారు.
స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలకు మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని.. ఉస్మానియా కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయటం పెద్ద సమస్య కాదని అన్నారు. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గత పాలకులు కుట్రపూరితంగా ఒయును నిర్వీర్యం చేయాలని చూశారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒయు చరిత్ర ఆగిపోవద్దని ఆకాంక్షిన రేవంత్ రెడ్డి… ఈ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఒయు నిటారుగా నిలబడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఈ యూనివర్సిటీని గాలికొదిలేయడం సరికాదని…. పూర్తి డీపీఆర్‌లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
డిసెంబర్‌లో మళ్లీ ఆర్ట్ కాలేజీ వద్ద సభ
డిసెంబర్‌లో మళ్లీ ఆర్ట్ కాలేజీ వద్ద సభ పెడితే తాను హాజరవుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను వచ్చే రోజు క్యాంపస్‌లో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దని డిజిపి, నగర కమిషనర్‌ను ఆదేశించారు. విద్యార్థులను నిరసన చేసుకోనివ్వండంటూ పోలీసులకు సూచించారు. ఒకవేళ విద్యార్థులు తనను అడ్డుకుని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో సభ పెట్టి ఒయుకు కావాల్సిన అన్ని పనులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎక్కడి నుంచో రాలేదని, ప్రజలందరూ ఆశీర్వదిస్తేనే ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని చెప్పారు.
దేశానికి యువ నాయకత్వం అవసరం
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఒయు విద్యార్థులు, నాయకులు త్యాగాలు చేశారని… నిస్వార్థ పోరాటాలు, ఉద్యమాలు సమజానికి మేలు చేస్తూ చరిత్రలో నిలిచిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజానికి సమస్యలున్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది, ధిక్కారస్వరన్ని వినిపించేది, పరిష్కార మార్గాలు వెతికేదీ ఉస్మానియానేనని వివరించారు. ఉస్మానియా వర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో ఒయులో సామాజిక న్యాయాన్ని అమలు చేశామని చెప్పారు. వర్సిటీలు ఉద్యోగులు, అధికారులను ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాదు అని, తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన మేధాసంపత్తిని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు వయసున్న యువత 65 శాతం ఉందని… యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయ పరిమితి నుంచి 21 సంవత్సరాలకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలని కోరారు.
యువ నాయకత్వం దేశానికి అవసరం అని, దేశానికి అతిపెద్ద సంపద యువతే అని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు, సైద్ధాంతిక చర్చలకు, సమస్యల పరిష్కారం దిశగా చర్చలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. విద్యాలయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించడం, డ్రగ్స్ తీసుకోవటం లాంటి వ్యసనాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలను కోటీశ్వరులను చేయటానికి తమ వద్ద పంచడానికి భూములు లేవు అని, నిధులు లేవు అని, చదువు మాత్రమే దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల తలరాతలను మార్చుతుందని అభిప్రాయపడ్డారు. ఒయు వైస్ ఛాన్స్‌లర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ, ఒయులో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో ఒయు పురోభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు.
2025 – 2026 నుంచి ఒయులో చేరే 200 మంది రెగ్యులర్ పిహెచ్‌డి విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున అందించనున్న ముఖ్యమంత్రి ఉపకారవేతనాన్ని సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సింగరేణి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రభుత్వ సహకారంతో ఈ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. హెచ్‌ఎండిఎ సహకారంతో 8.5 కోట్లు ఒయు పేరుతో చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీతో ప్రవేశపెట్టిన మరో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒయులో చదివే పిజి, పిహెచ్‌డి విద్యార్థుల పరిశోదనల కోసం చేసే విదేశీ పర్యటనల కోసం ఆర్థిక సహకారం అందిస్తారు.