పకృతి ప్రళయంతో చిన్నాభిన్నమైన కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు . వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. సిఎం రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా తాడ్వాయి మండలం, ఎర్రపహాడ్ గ్రామానికి సిఎం చేరుకుంటారు. అక్కడి నుండి 11 గంటల 45 నిమిషాలకు లింగంపేట్ చేరుకొని లింగంపల్లి, లింగంపల్లి కుర్దు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలిస్తారు. రోడ్డు మార్గాన ఉన్న వరద ప్రభావిత గ్రామాల్లో ఏదో ఒక గ్రామాన్ని పరిశీలించి అక్కడ బాధిత రైతులతో మాట్లాడే అవకాశాలున్నట్లు తెలిసింది. అనంతరం ఒంటిగంట పది నిమిషాల నుండి రెండు గంటల వరకు కామారెడ్డిలోని జి ఆర్ కాలనీలో పర్యటించనున్నారు. అక్కడే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది.
అక్కడి నుండి కలెక్టరేట్‌కు చేరుకొని జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాలతోపాటు రోడ్లు, కుంటలు చెరువులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి రోడ్ల వివరాలతో పాటు జిల్లా కేంద్రంలో జరిగిన వరద నష్టానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో అధికారులతో చర్చించే అవకాశం ఉంది. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడి హైదరాబాద్ వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జిల్లా కేంద్రంలో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారికి రూ.11,500 వంతున ఆర్థిక సహాయాన్ని అందించింది. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. వర్షాలు తగ్గిన వెంటనే మెదక్ పర్యటన అనంతరం కామారెడ్డి వస్తున్నట్లు ప్రచారం జరిగినా అనివార్య కారణాలతో సిఎం రాలేకపోయారు.
కాగా, గురువారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రానుండటంతో వరద బాధిత ప్రాంతాలతో పాటు బాధిత కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. సిఎం హామీ కోసం వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, లింగంపేట్ మండలాలలో వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న నేపథ్యంలో తమకు జరిగిన నష్టానికి తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటిస్తారని ఆశలతో బాధితులు ఎదురుచూస్తున్నారు.