భోపాల్: పరీక్ష హాలులో ఓ విద్యార్థి చెంప కలెక్టర్ చెళ్లుమనిపించాడు. ఈసంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భిండి జిల్లాలో జరిగింది. బిండి జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాత్సవ్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా దీన్‌దయాల్ డంగ్రౌల్ మహావిద్యాలయానికి తనిఖీలు చేయడానికి వెళ్లాడు. రోహిత్ రాథోర్ అనే విద్యార్థి వద్ద ప్రశ్నాపత్రం లేకపోవడంతో అతడి చెంప చెళ్లుమనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్‌దయాల్ డంగ్రౌల్ కాలేజీలో కాపీంగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం రావడంతో తనిఖీలు చేయడానికి వెళ్లానని కలెక్టర్ సంజీవ్ తెలిపాడు. ఎగ్జామ్ హాల్‌లోనికి వెళ్లిన తరువాత తరగతి నిశ్శబ్ధంగా కనిపించింది. రోహిత్ అనే విద్యార్థిని ప్రశాపత్రం అడిగాను అతడు లేదని చెప్పడంతో సదరు విద్యార్థిని కొట్టానని వివరణ ఇచ్చాడు. జవాబుల కోసం ప్రశ్నాపత్రాని సదరు విద్యార్థి బయటకు పంపించాడని కలెక్టర్ తెలిపాడు.
కలెక్టర్ సార్ వచ్చేసరికి మూత్ర విసర్జన కోసం బాత్రూమ్‌కు వెళ్లానని రోహిత్ అనే విద్యార్థి తెలిపాడు. తన సీటు వద్ద కలెక్టర్ కనిపించడంతో ప్రశ్నపత్రం ఎక్కడా అని ప్రశ్నించాడు. అక్కడ ప్రశ్నాపత్రం లేకపోవడంతో తనపై కలెక్టర్ చేయి చేసుకున్నాడని రోహిత్ పేర్కొన్నారు. ఒక విద్యార్థి వద్ద రెండు ప్రశ్నాపత్రాలు ఉన్నట్టు కలెక్టర్ గుర్తించారని విద్యార్థి వివరణ ఇచ్చాడు. రూమ్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా తనపై కలెక్టర్ మరోసారి చేయి చేసుకున్నాడని సదరు విద్యార్థి పేర్కొన్నాడు. ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపించలేదని, తాను సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్నానని, మరోసారి కూడా తాను రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని విద్యార్థి వివరణ ఇచ్చాడు.