Saturday, May 17, 2025

కమీషన్ల లొల్లి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు కమీషన్లు తీసుకున్నారని
అన్నాను దానిని వక్రీకరించిన బిఆర్‌ఎస్ సోషల్
మీడియా ఇది మా మంత్రుల మధ్య చిచ్చుపెట్టే కుట్ర
మంత్రి కొండా సురేఖ సుదీర్ఘ వివరణ ఎవరెంత
కమీషన్లు తీసుకున్నారో తేలాలి వెంటనే దర్యాప్తు
చేపట్టాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 30శాతం కమీషన్
బహిరంగ రహస్యమే ఇప్పటికైనా చెప్పినందుకు
సురేఖకు అభినందనలు : బిఆర్‌ఎస్ అగ్రనేత కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: “గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికైనా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని తాను అన్నటువంటి వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా వక్రీకరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును ఉద్దేశించి నేనా ఆ వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదు. బిఆర్‌ఎస్ పాలనలో మంత్రులు కమీషన్లు తీసుకునే వారన్న వ్యాఖ్యలు అక్షర సత్యం. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా.” అని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాను గురువారం వరంగల్‌లో చేసిన వ్యాఖ్యల మీద కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ మంత్రి శుక్రవారం సుధీర్ఘ వివరణ ఒక ప్రకటన రూపంలో ఇచ్చారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బిఆర్‌ఎస్ నాయకులు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

దీనిలో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్‌ను కావాలనే హైలైట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇదేనని మంత్రి వెల్లడించారు. నేను అన్నది కేవలం గత ప్రభుత్వంలో మంత్రులు పైసలు తీసుకొని పనిచేసేవారిని మాత్రమేనని, కానీ నా వ్యాఖ్యలను పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు ఎడిటింగ్ చేసిన మార్ఫింగ్ వీడియో చేసి రెండు రోజులుగా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియోను ఇలా సర్కులేట్ చేసి, తమ మంత్రివర్గ సహచరుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి పనిచేసుడు తెలుసు, పరిపాలన చేయడం తెలుసునని అన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ళకి సోషల్ మీడియాలో దొంగ ప్రచారం, తప్పుడు ప్రచారం ఎలా చేయాలో మాత్రమే తెలుసునని విమర్శించారు.

ఇటువంటి దుష్ప్రచారాలు ఇంకొకసారి చేస్తే ఎంత మాత్రం సహించేదిలేదని, ఇలా చేసే ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు. అసలు మీ బీఆర్‌ఎస్ నేతల నిర్వాకం వల్లనే కదా మంత్రులకు డబ్బులు ఇస్తే తప్ప ఫైళ్లు క్లియర్ కావు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఈ విషయం మీ హయంలో పని చేసిన మంత్రి నాయిని నరసింహారెడ్డి కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ కాకతీయలో ఉన్న కమీషన్ బాగోతాన్ని కమిషన్ కాకతీయ అని సంబోధించి మీ అవినీతిని బయట పెట్టలేదా? అని మంత్రి గట్టిగా జవాబిచ్చారు. ఇక దళిత బంధులో ప్రతి ఎమ్మెల్యే 30 శాతం కమిషన్ తీసుకుంటారని అప్పటి సీఎం కేసీఆర్ గారే మీ ఎమ్మెల్యేల గురించి చెప్పలేదా? అని గుర్తు చేశారు. ఊర్ల మీద పడి ప్రజల రక్తాన్ని పిలిచారు కాబట్టే ప్రజలు మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. అయినా మీ బుద్ధి మారలేదు. ప్రతి అంశానికి వక్రభాష్యాలు చెబుతూ మీ వంకర బుద్ధిని బయట పెట్టుకుంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

ఎవరెంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్త చేయించాలి: కిషన్‌రెడ్డి

గత 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్త చేయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా ఓ మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుఎతూ మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్‌కు కమీషన్లు తీసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కిషన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలను ప్రజల ముందుంచాలని కూడా కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సర్కార్‌లో 30 శాతం కమీషన్ బహిరంగ రహస్యమే: కెటిఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ తీసుకుని నడుపుతోందన్నది బహిరంగ రహస్యమేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ సంగతి చెప్పినందుకు మంత్రి సురేఖకు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వంలో, మంత్రులు, వారి స్వంత సహోద్యోగులు భారీగా కమీషన్లు తీసుకోకుండా సంతకం చేయరని విమర్శించారు. కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా కూడా చేసి, ప్రభుత్వ కమీషన్ వ్యాపారాన్ని బయటపెట్టారని గుర్తు చేశారు. కమీషన్లు తీసుకుంటున్న కాంగ్రెస్ మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని తాను కొండా సురేఖను కోరుతున్నానని తెలిపారు. ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ తమ సొంత క్యాబినెట్ మంత్రితో విచారణకు ఆదేశించగలరా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News