తెలుగు పాఠకులలో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని గురించి వినని వారుండరు. చారిత్రక గ్రంథ రచనకు అనేక మందిని ప్రొత్సహించిన, వెలువరించిన సంస్థ అది. ఆ సంస్థకు వ్యవస్థాపకుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. బహుభాషా పండిత్యానికి, మేథోనైశిత్యానికీ, చారిత్రక పరిశోధనకీ, పరిశీలనా దృష్టికీ ఆయన నిలువుటద్దం. యావజ్జీవితాన్ని చారిత్రక పరిశోధనకు ఆయన అంకితం చేసిన కృషీ వలుడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (మే 18, 1877 – జూలై 12, 1923) తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన విజ్ఞానవేత్త.
ఎందరో సాహితీ మూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన గొప్ప వ్యక్తులలో లక్ష్మణరావు ఒకడు. లక్ష్మణరావు సంఘ సంస్కరణాభిలాషి, బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. వితంతు వివాహం, భోగం మేళాల నిషేధం, అస్పృశ్యతా నివారణ, సముద్రయానం, అంతశ్శాఖా వివాహం వంటి వాటిని ప్రోత్సహించాడు. స్త్రీలలో విద్యాభివృద్ధికి తన సోదరి అచ్చమాంబతో కలసి ప్రయత్నించాడు. రాత్రిళ్ళు హరిజనులకు విద్య నేర్పే కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1877 మే 18న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలలో జన్మించిన ఆయన ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తిచేశాడు. అక్కా, బావల వద్ద నాగపూరులో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ. పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో ఉత్తీర్ణుడ య్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, ఆంగ్లం, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలోనూ ఆయన ప్రావీణ్య తను సంపాదించాడు.
విద్యాభ్యాస మైనాక మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానములో ఉద్యోగము లభించగా, రాజా ప్రోత్సాహం వల్ల సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, ఆర్థిక సహాయాన్ని పొంది, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయ గలిగాడు. కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారితో కలసి హైదరాబాదు లోని నాటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో 1901 సెప్టెంబర్ 1 న శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయమును స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ముఖ్యోద్దేశ్యంగా అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. అలాగే లక్ష్మణరావు, నాయని వేంకటరంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు.
తద్వారా 1906 – 1910 మధ్యకాలంలో మండలి 30 పైగా గ్రంథాలను ప్రచురించడం జరిగింది. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు పాత్ర మరువ లేనిది. 1922 డిసెంబర్ 27 న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు కలసి ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. తెలంగాణ శాసనాలు, షితాబుఖాను చరిత్ర మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. తరువాత దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. 1916 కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించినవారిలో లక్ష్మణరావు ఒకడు. మొదటినుండి యావజ్జీవ సభ్యుడుగా ఉండడమే కాకుండా, కొంతకాలం దానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారికి పంచాలని, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ.
1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట ’అ’కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో విజ్ఞాన శాస్త్రము, భాష, ఖగోళ శాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు వ్రాశాడు. ‘అ‘కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత ఆంధ్ర సంపుటాన్ని తయారు చేసే పనిలో లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమై, మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12 న 46 యేళ్ళ వయసులోనే కొమర్రాజు లక్ష్మణరావు మరణించాడు. కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణరావు కూడా మరణించడం గమనార్హం.
– రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494
( నేడు కొమర్రాజు లక్ష్మణ్ రావు జయంతి)