‘పోక్సో’ కేసుల్లో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, వారికి పరిహారాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అందించే ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లైంగిక నేరాల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ‘లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ’ అనే అంశంపై శనివారం జరుగుతున్న న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, రిజిస్టార్లు, పోలీసు ఉన్నతాధికారుల కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని చర్యలు చేపట్టినా దేశంలో లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక దాడులకు సంబంధించిన నివేదిక రాగానే వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టామని, 90 శాతం కేసుల్లో నిందితులకు కఠినమైన జైలు శిక్ష పడేలా చేశామని అన్నారు.
గంజాయి మత్తు పదార్థాల వల్లే ఎక్కువగా లైంగిక దాడులు
లైంగిక దాడులకు సంబంధించి అసలు మూలాలను కనిపెట్టి వాటిని నియంత్రించే చర్యలు చేపట్టామని మంత్రి సీతక్క వెల్లడించారు. గంజాయి మత్తు పదార్థాల వల్లే ఎక్కువగా దాడులు జరుగుతున్నట్టు పోలీసు విచారణలో తేలిందని అన్నారు. అందుకే గంజాయి మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పోలీస్ శాఖలో ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయి మత్తు పదార్థాల వినియోగాన్ని, రవాణాను అణచివేస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు చిన్న వయసు నుంచి పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాలని నిర్ణయించామ ని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా, మహిళా స్వయం సహాయక బృందాల సహకారంతో చిన్నారులు, కిశోర బాలికలు,
కౌమార బాలికలు అందరికీ అవగాహన కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా బలమైన మహిళా సంఘటితశక్తి ఉందని వివరించారు. మహిళా ఆర్మీని సిద్ధం చేసి గ్రామాల్లో వేధింపులు, దాడుల పట్ల అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి అనే పాలసీ ద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి వల్ల మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం అవుతున్నారు. ఇందిరా మహిళా శక్తి విధానంలో చిన్నారులు, మహిళల సంరక్షణ ఎజెండాగా చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. నిందితులకి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం, పోలీసులు జడ్జిలు అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయాధీశులు, పోలీసు ఉన్నతాధికారులు బాధితులకు సత్వర న్యాయం అoదే విధంగా చూడాలి