Friday, May 30, 2025

మావోలతో చర్చలకు అడ్డేమిటి?

- Advertisement -
- Advertisement -

అన్ని రకాల అధికారాలు, అంగ, అర్థబలం కలిగిన వర్గాలు అంటే ప్రభుత్వాలు లేదా మెజారిటీ వర్గాలు ఇతరులను లొంగదీసుకోవడానికి బలప్రయోగాన్ని వాడుతుంటాయి. ఇది ప్రజాస్వామిక యుగంలో ఆహ్వానించదగిన పరిణామం కాదు. అధికారంలో ఉన్న వాళ్లు యుద్ధాన్ని కోరుకుంటారు. యుద్ధం ద్వారా విధ్వంసం జరుగుతుంది. కాని వివేకంతో వారిని గెలుచుకోవాలి. అందుకు యుద్ధాన్ని, దాడులను పరిష్కారమని చూడకూడదు. చర్చలు, పరస్పర అంగీకారం శాంతిని చేకూర్చగలదు” అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ 1946 డిసెంబర్ 17వ తేదీన భారత రాజ్యాంగ సభలో మాట్లాడుతూ హెచ్చరించారు. అప్పుడుంది ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ల మధ్య సాగిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన వ్యాఖ్యలు. సందర్భం వేరు కావచ్చు. సమయం మారిపోయి ఉండవచ్చు. కాని కొన్ని సార్వజనీన సత్యాలుగా ఉంటాయి.

ఈ సందర్భంగా ప్రముఖ రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ మాటలను కూడా ఆయన ఉదహరించారు. మెజారిటీ, మైనారిటీ వర్గాలు పరస్పరం ఒక అవగాహనకు రావాలని ఇద్దరి అభిప్రాయం కూడా.మనకన్నా శక్తి, బలం, బలగం తక్కువ ఉన్న వాళ్లను లొంగదీసుకోవడం లేదా నిర్మూలించే ప్రయత్నం చేయడం పెద్ద కష్టమేమీ కాదని, ఆయుధాలతో జయించడం కన్నా వివేకంతో వారిని గెలుచుకోవడం గొప్ప విజయమవుతుందని బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం. ఈ వాక్యాలు, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బస్తర్‌లో కగార్ పేరుతో జరుగుతున్న దాడికి సరిగ్గా సరిపోతాయి. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఒక సంవత్సరంలోపు సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం మనమంతా చూశాం.

వేల మంది సైనికులను మోహరించి నక్సలైట్లను నిర్మూలించడం అసాధ్యం కాకపోవచ్చు. ఇది లక్షలాది సైన్యం కలిగిన భారత ప్రభుత్వానికి చాలా చిన్న విషయం. అయితే దాని వల్ల వేల సంవత్సరాలుగా నివసిస్తున్న ఆదివాసులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. బస్తర్ అడవుల్లో అడుగడుగునా ఏర్పాటు చేసిన సైనిక శిబిరాల వల్ల ఆదివాసీ గూడేలు విధ్వంసానికి గురవుతున్నాయని, ఎంతో మంది ఆదివాసులు ప్రాణాలు కోల్పోతున్నారని కొన్ని ప్రజా సంఘాలు, కొంత మంది పార్లమెంటు సభ్యులు, కొన్ని రాజకీయ పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘాలు, పార్టీలు మరొక అడుగు ముందుకు వేసి నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపి కాల్పులను విరమించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇటీవల మావోయిస్టు పార్టీ ప్రతినిధి రూపేశ్ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో నిర్వహిస్తున్న దాడులను వెంటనే నిలిపివేసి, శాంతి చర్చలకు మార్గం సుగమం చేయాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించే అవకాశముండగా, బల ప్రయోగంతో దీనిని సాధించాలని చూడడం సరికాదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు భారత రాష్ట్ర సమితి నాయకులు కె. చంద్రశేఖర్‌లు కూడా ‘కగార్ ఆపరేషన్’ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అయితే ఈ డిమాండ్ కొత్తదేమీ కాదు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపడానికి అంగీకరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్లతో శాంతి చర్చలు జరిగాయి. అయితే దాని వలన నక్సలైట్లు అధికారంలోకి రావడం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం గాని జరగలేదు. కాని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి సందర్భాలకు అవకాశం ఉంటుందనే విషయం మనకు అర్థమైంది. ఇక్కడ మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇటీవల నాగాలాండ్ తిరుగుబాటు దారులతో శాంతి ఒప్పందం చేసుకున్నది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

ఇటు భారత ప్రభుత్వం, నాగా తిరుగుబాటుదారులు కాల్పుల విరమణను పాటించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోనే అవకాశం ఉండాలని భావించాయి. దానిని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతించాయి. అంతేకాకుండా ఈశాన్య భారతంలో శాంతిని స్థాపించడానికి ఇది దోహదం చేయగలదని భావించాయి. అదొక్కటే కాదు, ఈశాన్య భారతంలో చాలా సార్లు మిలిటెంట్ గ్రూపులకు, భారత ప్రభుత్వానికి మధ్య శాంతి ఒప్పందాలు జరిగాయి. దాని వల్ల 70 శాతానికిపైగా హింసాత్మక సంఘటనలు తగ్గినట్టు స్వయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.2014లో ఎ.ఎన్.వి.సి శాంతి ఒప్పందం జరిగింది. అచిక్ నేషనల్ వాలంటీర్ కౌన్సిల్ (ఎ.ఎన్.వి.సి) సంస్థతో మేఘాలయలో ఒక అంగీకారం కుదిరింది.

త్రిపురలోని నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌తో 2019లో చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది. అసోంలోని బోడోతిరుగుబాటుదారులతో 2020లో కూడా చర్చలు జరిగి శాంతి ఒప్పందం కుదిరింది. అదే అసోంలోని కర్బి అంగ్‌లాంగ్ ప్రాంతంలోని కర్బి తిరుగుబాటుదారులతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఒక అంగీకారానికి వచ్చాయి. అసోంలోని కొన్ని ఆదివాసీ తిరుగుబాటుదారులతో 2022లో ఆదివాసీ పీస్ అకార్డు కుదిరింది. మణిపూర్‌లోని యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్) సంస్థతో 2023లో చర్చలు జరిగాయి. శాంతి ఒప్పందం కుదిరింది. యుఎన్‌ఎన్‌ఎఫ్ సంస్థ మణిపూర్ లోయలో చాలా ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థ. మొట్టమొదటిసారిగా ఆసంస్థ దాడులను ఆపివేసి, భారత రాజ్యాంగం ప్రకారం పని చేస్తామని ప్రకటించింది.

దానితోపాటు ఇటీవల 2023 డిసెంబర్, 29వ తేదీన అసోంలోని ఉల్ఫా (యుఎల్‌ఎఫ్‌ఎ) సంస్థతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. గత సంవత్సరం నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో కూడా చర్చలు 2024 సంవత్సరం సెప్టెంబర్ 4 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నది.ఈ విషయాలన్నీ ఇక్కడ ప్రస్తావించడానికి బలమైన కారణమున్నది. ఇంతకు ముందు పేర్కొన్న అన్ని సంస్థలు భారత దేశంతో చాలా విరోధంగా ఉన్నవే. కొన్ని సంస్థలైతే భారతదేశంలో తాము ఉండలేమని, తాము ప్రత్యేక దేశంగా ఉంటామని, ఈ రాజ్యాంగం పట్ల తమకు నమ్మకం లేదని ప్రకటించాయి. అయితే అటువంటి సంస్థలు చర్చలకు సిద్ధమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి చర్చలు జరిపింది. వీటి వల్ల మంచి ఫలితాలు వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. నక్సలైట్ల విషయానికొస్తే, కొంత భిన్నమైన సైద్ధాంతిక భూమిక ఉంది. ఈ ప్రభుత్వాలు, ప్రస్తుత వ్యవస్థ, చట్టాల పట్ల విశ్వాసం లేదు. భూస్వామ్య, బూర్జువాల నాయకత్వంలోని వ్యవస్థల స్థానంలో నూతన ప్రజాతంత్ర విప్లవ ప్రభుత్వాన్ని స్థాపించాలనేది వారి లక్షం.

అందుకు గాను వాళ్లు సాయుధ పోరాటం అనే మార్గాన్ని ఎంచుకున్నట్టు ప్రకటించారు. అయితే వాళ్లు దేశంలోని పౌరులే. మావోయిస్టు పార్టీతో పాటు ఆ ప్రాంతంలో అనాదిగా నివాసముంటున్న ఆదివాసులు కూడా ఉన్నారు. కారణాలేమైతేనేమి మావోయిస్టు పార్టీ స్వయం గా చర్చలకు ప్రతిపాదన చేసింది. ఇది మంచి పరిణామం. దేశంలోని ప్రజాస్వామిక సంఘాలు, సంస్థలు దీనిని సమర్థిస్తున్నాయి. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మొండిగా తమ బలాన్ని, బలగాలను ఉపయోగించి మావోయిస్టు పార్టీతో పాటు, ఆదివాసులను కూడా నిర్మూలించే విధంగా దాడులు చేయడం మంచిది కాదు. నిజానికి దేశంలోని పౌరులు ఏదైనా ఆందోళన చేస్తే పోలీసులను, ఇతర రక్షణ బలగాలను ఉపయోగించి అదుపులోకి తేవచ్చు. కాని సరిహద్దులను కాపలా కాసే సైనికులను మన పౌరుల మీదకే యుద్ధానికి పంపడం సరైన మార్గం కాదని, గతంలో ఎందరో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

నక్సలైటు ఉద్యమం నిజానికి ఇతర టెర్రరిస్టుల లాగా వ్యవహరించే సంస్థ కాదు. అయితే చట్ట వ్యతిరేకులుగా ఆయుధాలు పట్టుకొని ఉండవచ్చు. దానికి బలమైన సామాజిక, ఆర్థిక రూపాలు ఉన్నాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. నక్సలైటు ఉద్యమ విజయాలు, వైఫల్యాల గురించి చర్చించే సందర్భం ఇది కాదు. ముందుగా ఒక విశాలమైన అడవి ప్రాంతం తుపాకుల మోతలతో, రక్తపాతంతో నిండిపోవడం ఆగిపోవాలి. దేశంలోని ప్రతి పౌరుడు దీని గురించి ఆలోచించాలి. చర్చలు జరిగి రెండు వర్గాలు ఒక ఒప్పందానికి వస్తే అది కూడా అడవి బిడ్డల జీవితాలు సురక్షితంగా ఉంటాయి. లేదంటే వేల ఏళ్లుగా అడవిని నమ్ముకొని ఉన్న ప్రజలు తమ ఆనవాళ్లు లేకుండాపోతారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అన్ని సంస్థలతో చర్చలు జరిపినట్టే మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపితే కేంద్ర ప్రభుత్వం తన వివేకాన్ని ప్రదర్శించినట్టు అవుతుంది.

  • మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News