Monday, August 4, 2025

నేడు కాంగ్రెస్ చలో ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిసి రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ఈ పోరాటాన్ని మరింత ఉతృతపరచాలని సంకల్పించింది. ఇందులో భాగంగా బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హస్తినలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. కార్యకర్తల కోసం 4న (సోమవారం) చర్లపల్లి నుంచి హస్తినకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఈ రైలులోనే కార్యకర్తలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ వెళ్ళనున్నారు. కాగా మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ నాగ్‌పూర్ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.

బిసి రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. బిసిల ఓట్లు కొల్లగొట్టేందుకు బిసి బిల్లు, ఆర్డినెన్స్ పేరిట కాంగ్రెస్ డ్రామా చేస్తున్నదన్న విపక్షాల విమర్శలతో ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా మరింత పట్టుదలగా సాధించేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గత నెల 31న ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగారెడ్డి జిల్లా పరిగిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకూ తొలి విడత పాదయాత్ర కొనసాగాల్సి ఉండగా, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమం ఉన్నందున ఈ పాదయాత్రకు సోమవారం స్మాల్ బ్రేక్ ఇవ్వనున్నారు.

ఆందోళన కార్యక్రమం ఇలా..
4న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రత్యేక రైలు హస్తినకు బయలుదేరనున్నది. ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షుడు తప్పని సరిగా జిల్లా కమిటీతో సహకరించుకుంటూ ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను వెంట తీసుకుని రావాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ రైలులో నాయకులు, కార్యకర్తలతో పాటు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళనున్నారు. అయితే మార్గమధ్యంలో నాగ్‌పూర్ వద్ద వారిరువురు విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీకి చేరుకుంటారు. 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో పాల్గొంటారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ తదితరులు ఈ ధర్నాలో పాల్గొంటారు. ఢిల్లీ దద్ధరిల్లేలా మహా ధర్నా నిర్వహించాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఆ మర్నాడు 6న పార్లమెంటులో బిసి బిల్లుకు వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీలతో ప్రతిపాదించాలని, 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం సమర్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలని పిసిసి భావిస్తున్నది. అయితే పాద యాత్ర తేదీలను ఖరారు చేయలేదు.

సాధించే వరకు విశ్రమించేది లేదు..
ఇదిలాఉండగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకూ విశ్రమించ రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి లోగడ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కోర్టు ఆదేశం, మరో వైపు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరకుండా ఎన్నికలకు వెళితే ప్రతిపక్షాలకు విమర్శించేందుకు ఆయుధాన్ని అందించినట్లు అవుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తున్నది.

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రతిపాదించి అన్ని పార్టీల సహకారంతో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిల్లును గవర్నర్‌కు పంపించడంతో, ఈ బిల్లు విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించింది కాబట్టి కేంద్రానికి పంపించారు. బిసి రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నదన్న భావనతో రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ తేవాలని భావించింది. ఈ మేరకు ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపించగా, గవర్నర్ న్యాయ సలహా కోసం పంపించారు. బిసి రిజర్వేషన్ల బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్‌కు చట్టపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ఆ ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించారు. ఇలా బిసిల రిజర్వేషన్లపై జాప్యం జరుగుతున్నదని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు హస్తిన బాట పట్టారు. బిసిలకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలోగా రిజర్వేషన్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News