Tuesday, July 1, 2025

కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి!

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయదశమి నాటికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంతోపాటు పిసిసి అధ్యక్ష స్థానం, మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అసమ్మతి నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే అధికార మార్పిడి ఉండబోదని, సిద్ధరామయ్యే పూర్తికాలం పదవిలో కొనసాగుతారని ఆయన వర్గం నేతలు ధీమాగా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థానాన్ని ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు వదిలి పెట్టాల్సిన పరిస్థితి వస్త్తే పిసిసి అధ్యక్ష పదవిని తనకు చిరకాలంగా మద్దతు ఇస్తూ వస్తున్న మంత్రి సతీశ్ జార్ఖిహొళికి కట్టబెట్టాలని సిద్ధరామయ్య పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.

మరోవైపు కర్ణాటకలో అధికార మార్పిడి గురించి సోమవారం విలేఖరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, అంతా పార్టీ అధిష్ఠానవర్గం చేతుల్లో ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయంపై ప్రతిపక్ష బిజెపి నేత తేజస్వి సూర్య స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానవర్గం అనేది దయ్యం లాంటిదని, అది ఎవరికీ కనిపించదు, వినిపించదని ఎద్దేవా చేశారు. పార్టీకి అధ్యక్షుడు అధిష్ఠానం కానప్పుడు మరెవరని కూడా ఆయన ఎదురుప్రశ్న వేశారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌లో (State Congress) ఎలాంటి లుకలుకలు లేవని, తాను, శివకుమార్‌లు కలిసి బాగానే పని చేస్తున్నామని చెప్పడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. సోమవారం మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు నేతలు చేతులు పట్టుకుని పైకెత్తి తాము కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇరువురు నేతలు కలిసి ఉన్నట్లు పైకి కనిపించినా ఇద్దరి మధ్య దూరం కొనసాగుతూనే ఉందనేది పార్టీ వర్గాల అభిప్రాయం. వాస్తవానికి 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటినుంచి కూడా ముఖ్యమంత్రి పీఠంపై వివాదం కొనసాగుతూనే ఉంది. సిఎం పదవికోసం సిద్ధరామయ్యతో పాటు శివకుమార్ కూడా గట్టిగానే ప్రయత్నించారు. ఇరువురూ చెరి రెండున్నరేళ్లు సిఎం పదవి చేపట్టేలా ఒప్పందం కుదిరినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై అటు పార్టీ అధిష్ఠానం కానీ, ఇటు సిద్ధరామయ్య, శివకుమార్‌లు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాష్ట్రంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తుండడంతో ఇప్పుడు మరోసారి నాయకత్వం మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

వాస్తవానికి ముడా స్కామ్, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటినుంచి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలని అటు ప్రతిపక్ష బిజెపితో పాటుగా ఇటు కాంగ్రెస్‌లోని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, సిద్ధరామయ్య తప్పుకోకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోతుందని అప్పుడు ‘సందట్లో సడేమియా’గా తాము అధికారంలోకి రావ్చని కాషాయ నేతలు భావిస్తున్నారని, కాంగ్రెస్‌లో అసమ్మతి కుంపట్ల వెనుక ఆ పార్టీ హస్తముందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలోకి రావడంకోసం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఖాళీ ఖజానా పెద్ద అడ్డంకిగా మారడంతో సిద్ధరామయ్య సర్కార్‌పై ప్రజల్లో అసహనం మొదలైంది. దీనికి తోడు నిధులు లేకపోవడం, ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడంతో అధికార పార్టీ నేతల్లో సైతం అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో మళ్లీ పార్టీలో అసమ్మతి గళం బలంగా వినిపించడం మొదలైంది.

డిప్యూటీ సిఎం శివకుమార్ రెండు, మూడు నెలల్లో ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయనకు సన్నిహితుడైన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇక్బాల్ హుస్సేన్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లోగా కర్ణాటకలో నాయకత్వ మార్పు చేయాలని అధిష్ఠానం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఇక్బాల్ కామెంట్స్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరు చెమటోడ్చారో అందరికీ తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తాను దాపరికపు మాటలు చెప్పనని, వాస్తవాలే చెప్తున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి చేయిదాటేలా ఉందని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా భావించినట్లు కనిపిస్తోంది.

కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇంచార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలాను హుటాహుటిన బెంగళూరుకు పంపించింది. మూడు రోజులపాటు రాష్ట్రంలోనే ఉండనున్న ఆయన అసమ్మతి ఎంఎల్‌ఎలందరితో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని, ఆ తర్వాత అధిష్ఠానానికి ఆయన అందించే నివేదికపై సిద్ధరామయ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి మొదటినుంచీ కలహాల కాపురంగానే ఉండడం గమనార్హం. పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన కర్ణాటకలో పరిస్థితితో కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా తల బొప్పి కడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News