Monday, July 28, 2025

ఆలేరు అభివృద్ధే మా లక్ష్యం: బీర్ల అయిలయ్య

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
గత ప్రభుత్వంలో ప్రజలకు అన్నీ బాధలే
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
మనతెలంగాణ/యాదగిరిగుట్ట రూరల్: నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలేరును అభివృద్ధి చేయడమే లక్షంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమంలో బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి విద్యార్థులతో మాట్లాడారు. మండల పరిధిలోని రాళ్లజనగాం గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. జంగపల్లిలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, మల్లాపురంలో సీసీరోడ్డు, కమ్యూనిటీహాల్, అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సైదాపురంలో సీసీరోడ్డు, మాసాయిపేట, గౌరాయపల్లిలో సీసీరోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సాధువెల్లిలో అంగన్‌వాడీ భవనం, కాచారంలో సీసీరోడ్డుకు బీర్ల అయిలయ్య శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లుగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లేక ప్రజలు అనేక బాధలు పడ్డారని, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, మొదటిలో మంజూరైన ఇళ్ల నిర్మాణం మొత్తం పూర్తయితే రెండో విడతలో అర్హులను గుర్తించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. దివ్యాంగులకు 50 బస్తాల సిమెంట్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. మల్లాపురం గ్రామంలో రూ.40 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధిలో ఆలేరును అగ్రగామిగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్‌కుమార్, యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, నేతలు బీర్ల శంకర్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ముక్కెర్ల మల్లేష్‌యాదవ్, చీర శ్రీశైలం, దుంబాల వెంకట్‌రెడ్డి, శిఖ ఉపేందర్, శంకర్‌నాయక్, ఎరుకల హేమేందర్, గుండు నర్సింహ్మ, శివరాత్రి దానయ్య, జహంగీర్‌తో పాటు పంచాయతీ సెక్రటరీలు రోజా, దివ్య, స్పెషల్ ఆఫీసర్ శివరామకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News