ప్రెస్‌క్లబ్‌లో కాదు..అసెంబ్లీలో చర్చిద్దాం రండి
ప్రాజెక్టులు, ఎన్నికల హామీల అమలుపై చర్చకు మేం సిద్ధం
అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌తో కెటిఆర్ లేఖ రాయించాలి: మంత్రి పొన్నం
బనకచర్ల ద్రోహులు ఎవరో అసెంబ్లీలో బయట పెడతాం: అద్దంకి
ఉనికిని కాపాడుకోవడానికే కెటిఆర్ పాట్లు: యెన్నం
కెటిఆర్‌కు సిఎంను ప్రశ్నించే స్థాయిలేదు: ఎంఎల్‌ఎ సత్యనారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః నీటి పారుదల ప్రాజెక్టులను ఎవరి హయాంలో ఏ మేరకు పూర్తయ్యాయో చర్చించేందుకు దమ్ముంటే చర్చకు రా.. అంటూ కాంగ్రెస్.. బిఆర్‌ఎస్ నాయకుల సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో మంగళవారం హైడ్రామా కొనసాగింది. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోసం వేచి చూడగా, అదే సమయంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సోమాజిగుడాలోని ప్రెస్ క్లబ్‌లో వేచి చూశారు.
అసలేం జరిగిందంటే…గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎవరు ఏ మేరకు అమలు చేశారో బహిరంగంగా చర్చించడానికి సిద్ధమా ? అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రతి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకూ? తానే చర్చకు వస్తానంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇందులో భాగంగానే మంగళవారం కెటిఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి తదితరులతో కలిసి సోమాజిగుడాలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. ప్రెస్ క్లబ్‌కు కెటిఆర్ వస్తున్నారన్న సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు వస్తే అనవసరంగా రచ్చ అవుతుందన్న భావనతో వారు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కెటిఆర్ ఫైల్ చెంత పట్టుకుని ్ర పెస్ క్లబ్‌కు చేరుకుని కాన్ఫరెన్స్ హాలులో చాలా సేపు కూర్చున్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే తనతో చర్చించాలని, కెసిఆర్‌తో చర్చించే స్థాయి వారికి లేదని కెటిఆర్ అన్నారు. సుమారు గంటన్నర పాటు కెటిఆర్ అక్కడ వేచి ఉన్నారు.
ఈ విషయం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకున్న కెటిఆర్ అభిమానులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉత్కంఠత నెలకొంది. కాగా అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేరుకోసాగారు. సిఎల్‌పి కార్యాలయంలో వారు సమావేశమై కెసిఆర్ కోసం వేచి చూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సవాల్ విసిరితే, కెటిఆర్ ఎందుకు స్పందిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కెటిఆర్‌కు ధైర్యం ఉంటే తన తండ్రిని అసెంబ్లీకి తీసుకుని రావాలని వారు సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, ధైర్యం ఉంటే తండ్రిని ఒప్పించి తీసుకుని రావాలన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే సచివాలయానికి రారని, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీ సమావేశాలకూ రావడం లేదని వారు మండిపడ్డారు.
ఇదేమీ డ్రామా ..: బిజెపి నేత ప్రకాష్ రెడ్డి
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు చౌరస్తా డ్రామా చేశారని బిజెపి నాయకుడు, మాజీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన మంగళవారం మన తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. ఇదంతా మీడియా ముందు డ్రామా చేసి ప్రజల్లో తామే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అసెంబ్లీ వేదిక ఉన్న తర్వాత బయట చర్చించేందుకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎందుకని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాన్ని హాజరుపరిస్తే అప్పుడు బిఆర్‌ఎస్ నిజాయితీ ఎంతో బయటపడుతుందని ఆయన కాంగ్రెస్‌నుద్ధేశించి అన్నారు. వేర్వేరు వేదికలపై కూర్చుని చర్చకు రమ్మంటే అవతలి పార్టీ ఏలాగో రాదన్న భావనతోనే ఇలా డ్రామా చేశారని ఆయన విమర్శించారు.